
కొత్తగూడెం/ వైరా/ ఇల్లెందు/ ములకలపల్లి/ అశ్వారావుపేట టౌన్/ పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 4: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా భారీ వర్షం కురిసింది. వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరడంతో గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. సింగభూపాలెం చెరువు మత్తడి పోస్తోంది. కొత్తగూడెంలో 54.8 మిల్లీమీటర్లు, పాల్వంచలో 32.8, మణుగూరులో 42.6, టేకులపల్లిలో 19.2, ఇల్లెందులో 44.8, చండ్రుగొండలో 14.2, దమ్మపేటలో 45.8, అశ్వారావుపేటలో 22.6, ములకలపల్లిలో 60.8, బూర్గంపాడులో 6.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 22.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కిన్నెరసాని గేట్ల ఎత్తివేత
పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌లో భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శనివారం రాత్రి మూడు గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.