ఇల్లెందు, మే 7: నిరుపేద యువతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, వారి వివాహం కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. ఇల్లెందులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు శనివారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వారు తమ కుమార్తెల వివాహాలు జరిపించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిగండ్ల మాధవరావు, ఇల్లెందు వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, జడ్పీటీసీఉమాదేవి, టీఆర్ఎస్ నాయకులు శీలం రమేశ్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ మధు
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియను ఎమ్మెల్సీ తాతా మధు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. 16వ వార్డులో సీతారాముల ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధు ప్రత్యేక పూజలు చేశారు.