ఉమ్మడి పాలనలో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు.. పేరుకే పంటలకు ఉచిత విద్యుత్. అది కూడా కొన్ని గంటలు మాత్రమే. ఉదయం కరెంట్ ఉంటే రాత్రి ఉండదు. రాత్రి ఉంటే పగలు ఉండదు. రాత్రులు పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లి ఎంతో మంది రైతులు పాము కరిచి చనిపోయిన ఘటనలు ఉన్నాయి.. బావిలో పడి మృతిచెందిన విషాదాలు ఉన్నాయి.. వేసవి వచ్చిందంటే చాలు ఇళ్లకు గంటలు గంటలు పవర్ కట్. ఉక్కపోతలతో పిల్లా జెల్లా అల్లాడిపోయేవారు.. తెలంగాణ వస్తే ఏమొస్తదని నాడు వలస పాలకులు వెక్కిరించారు.. కరెంట్ కోసం ఛత్తీస్‌గఢ్‌కు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించారు. కరెంట్ కోతలకు చెక్ పెట్టారు.. వేసవి అయినా.. వానకాలమైనా పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు.. వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.. తెలంగాణ లోగిళ్లలో వెలుగులు ప్రసరింపజేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 2(నమస్తేతెలంగాణ) : గత పాలకుల హయాంలో వేసవి వచ్చిందంటే పట్టపగలే చుక్కలు కనిపించేవి.. కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక.. ఎప్పుడు పోతుందో అర్థం కాక నరకం అనుభవించారు. భానుడి భగభగకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. దీనికితోడు లోవోల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే నాలుగైదు రోజులు గ్రామమంతా అంధకారం అవహించేది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే కరెంట్ కోతలతో అల్లాడిపోతుందని సమైక్యవాదులు హేళన చేశారు. కానీ, తెలంగాణ ఏర్పాటైన అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు, నిరంతరాయంగా కరంటు సరఫరా జరుగుతుండడంతో చిన్నపరిశ్రమలపై ఆధారపడినవారికి చేతినిండా పనిదొరుకుతున్నది. రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. మోటర్ వైండింగ్, వెల్డింగ్ దుకాణాల్లో విరామం లేకుండా పనులు జరుగుతున్నాయి.
గతంలో కరెంట్ వచ్చిందంటే సంబురమే..
2014కు ముందు కరెంట్ వచ్చిందంటే సంబురమే. విద్యుత్‌పై ఆధారపడి బతికే కార్మికులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడేవారు. త్రీఫేజ్ కోసం ఎదురుచూసిన రైతులు పొలాల వద్దే పడిగాపులు కాసేవారు. ఎప్పుడు త్రీఫేజ్ వస్తుందో తెలియక రైతులు మోటర్ల వద్ద నిద్రపోయేవారు. వచ్చీరాని కరెంట్‌తో పొలాలు ఎండిపోయేవి. కరెంట్ కోసం వెళ్లిన రైతులు పాము కాటుకు గురై మృత్యుఒడికి చేరిన సంఘటనలూ ఉన్నాయి. కానిప్పుడా పరిస్థితి లేదు. కరెంట్ కోసం పొలం దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. నీళ్లుంటే నిరంతరాయంగా మోటరు పోస్తూనే ఉంటుంది. గతంలో తాగునీరు పరిస్థితీ అంతే. కరెంట్ ఉంటేనే ట్యాంకులోకి నీరు ఎక్కేది. లేకుంటే అంతే సంగతి. చేతిపంపులు కొట్టలేక ఇబ్బందులు పడేవారు. ఇదంగా తెలంగాణ రాకముందు ముచ్చట. ఇప్పుడు ఆ కష్టాలు ఆంధ్రావాసులు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు.
పొమ్మన్నాపోదాయే
పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలకులు అదేస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. రెప్పపాటున కూడా కరంటు పోకుండా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నది. పాతకరెంట్ తీగలు, స్తంభాల స్థానంలో కొత్తవాటిని అమర్చి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అన్ని మండలాల్లో సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చి అధికలోడు సమస్యను అధిగమించారు. కారిపోతున్న ఆయిల్‌తో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి కొత్తవాటిని బిగించారు. కొత్త విద్యుత్ స్తంభాలు బిగించి ఎల్ఈడీ లైట్లను బిగించి చీకట్లను పారదోలారు. సబ్స్టేషన్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. సెలూన్, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. తెలంగాణలో గృహ, వ్యాపార అవసరాలతోపాటు వ్యవసాయ రంగానికీ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో వినియోగదారులు ఆనందంగా గడుపుతున్నారు.
పెరిగిన వినియోగం.. అయినా అంతరాయం లేదు
భద్రాద్రి జిల్లాలో విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా అధికారులు పూర్తిస్తాయిలో చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 4,12,667 కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగదారులతోపాటు వ్యవసాయ రంగానికి, పరిశ్రమలు, పారిశ్రామిక రంగానికీ పూర్తిస్థాయిలో విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌రంగంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. వేసవిలో విద్యుత్ సరఫరా వినియోగం ఎక్కువ ఉంటోంది. ఎండ కాలంలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం అధికమైంది. దీనికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజు 37 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన సరఫరా కొనసాగుతున్నది.
వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌శాఖ అధికారులు అప్రమ త్తమయ్యారు. సరఫరాలో లోపం వచ్చినా వెంటనే దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ అధిక వినియోగంతో చాలాచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. అలాంటి చోట వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నారు. వేసవిలో గాలి దుమ్ము వచ్చిన సమయంలో చెట్లు పడడంతో విద్యుత్ వైర్లు తెగడం, పోల్స్ కిందపడడం వంటివి జరుగుతుంటాయి. ఈ విధమైన వాటిని వెంటనే గుర్తిస్తున్న విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసి వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వేసవిలో నిరంతరాయమైన విద్యుత్‌తోపాటు లోవోల్టేజీ సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తున్నారు.
72 సబ్ స్టేషన్లు.. 4,12,667 కనెక్షన్లు..
జిల్లాలో మొత్తం 72 సబ్స్టేషన్లు ఉన్నాయి. 4,11,667 కనెక్షన్లు ఉన్నాయి. అందులో గృహ అవసరాలకు సంబంధించి 3,21,368 కనెక్షన్లు, నాన్ డోమెస్టిక్ 35,208, పరిశ్రమలు 1,570, చిన్నతరహా పరిశ్రమలు 391, వ్యవసాయ కనెక్షన్లు 44,856, వీధి దీపాలు 3,608, ఆర్డబ్ల్యూఎస్ 1788, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు 2579, తాత్కాలిక సరఫరా కనెక్షన్లు 1119, హైటెన్షన్ సర్వీసులు 180 కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లకు రోజుకు 37 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది.
వ్యవ సాయం పండుగ..
గత ప్రభు త్వాలు వ్యవసాయ రంగాన్ని దండగ అన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 24 గంటల పాటు పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్దతు ధరకు ధాన్యం కొని రైతు బాంధవుడు అనిపించుకుంటున్నారు.
– గుర్రాల నాగేశ్వరరావు,
ఏపీ సరిహద్దు రైతు, మేడిశెట్టివారిపాలెం
కరంటు కోతలు లేవు
ఇండస్ట్రీకి కరెంటు సమస్యలేదు. గతంలో కోతలు ఉన్నప్పుడు మిల్లును బంద్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చాక నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. రాత్రులు పగలూ పని చేసుకునే అవకాశం కలిగింది. పనిఎక్కువ ఉన్నప్పుడు మిల్లు నడిచినా విద్యుత్ అంతరాయం లేకుండా ఉంది.
– కొండూరి సిద్ధార్థ, రైస్‌మిల్లు యజమాని, సుజాతనగర్
కరెంటు కోతల్లేవ్..
గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. కోతల కారణంగా పంటలకు నీళ్లందేవి కాదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్ కోతలకు చెక్ పెట్టారు. 24 గంటల పాటు పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.దీంతో ఏడా దిలో దర్జాగా రెండు పంటలు పండిస్తున్నాం.
– మల్లిశెట్టి శ్రీనివాసరావు, రైతు,
పాకలగూడెం, సత్తుపల్లి మండలం
తెలంగాణ వైపు.. దేశం చూపు..
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేవి. వేసవిలో కరెంట్ లేక అల్లాడేవాళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చీకట్లను చీల్చుతూ 24 గంటల పా టు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తు న్నది. గత ప్రభుత్వాలు చేతులెత్తేస్తే సీఎం కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని గాడిన పెట్టారు.
– ఒగ్గు జగ్గారెడ్డి, రైతు, కొత్తూరు, సత్తుపల్లి మండలం
దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నాం..
మాది వ్యవసాయ కుటుంబం. నేను అశ్వారావుపేటలోని సొంత భూమిలో 5 ఎకరాలు, జమ్మిగూడెంలో 10 ఎరకాల కౌలుకు తీసుకుని ఆయిల్‌పాం సాగు చేస్తున్నా. పాడి పశువులను పెంచుతున్నా. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాయితీపై ఎరువులు, పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తుండడంతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణ రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మేము కొన్నేళ్ల క్రితం ఆంధ్రా నుంచి ఇక్కడికి వలస వచ్చాం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు పండుగ అయింది.
– మాదాల విజయకృష్ణ, యువ రైతు, అశ్వారావుపేట