ఖమ్మం ఎడ్యుకేషన్, మే 4: ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. శుక్రవారం ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 59 కేంద్రాల్లో (ప్రభుత్వ కళాశాలలు 31, ప్రైవేట్ కళాశాలలు 28) 33,709 మంది విద్యార్థులు హాజరవనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఇంటర్మీడియట్ అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం ఉండకూడదని ట్రాన్స్‌కో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. పరీక్ష జరుగుతున్నంత సేపు ఇన్విజిలేటర్లు, సీఎస్, డీవో.. ఏ ఒక్కరు కూడా ఫోన్ వాడకూడదని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
జంబ్లింగ్ పద్ధతి
ప్రథమ సంవత్సరం (జనరల్ విభాగం) 16,698 మంది, ద్వితీయ సంవత్సరం 17,011 మంది విద్యార్థులు (మొత్తం 33,709 మంది) హాజరుకానున్నారు. జంబ్లింగ్ పద్ధతిన 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఉంటారు. పరీక్షా కేంద్రాలను జోన్లవారీగా విభజించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇన్చార్జ్ డీఐఈవో రవిబాబు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు మూడు ఫ్లెయింగ్ స్కాడ్స్, నాలుగు సిట్టింగ్ స్వాడ్స్‌ను నియమించారు. ప్రతి ఫ్లై యింగ్ స్వాడ్‌లో ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు. పరీక్షల నిర్వహణను హైపవర్ కమిటీ ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తుంది. దీనికి చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, ఆర్జేడీ, డీఐఈవో, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు, సబ్జెక్ట్ లెక్చరర్ ఒకరు సభ్యులుగా ఉంటారు.
నిఘా నేత్రాలతో పరిశీలన
ప్రశ్నాపత్రాల పంపిణీ నుంచి విద్యార్థుల సమాధాన పత్రాలు తీసుకునే వరకు ప్రతిదీ క్షుణ్ణంగా నిఘా నేత్రాల (సీసీ కెమెరాల) పర్యవేక్షణలో సాగనుంది. ఇంటర్ బోర్డు నుంచి ప్రశ్నాపత్రాల బండిల్స్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్లకు బుధవారం నాటికి తరలించారు. వీటిని తీసుకెళ్లేందుకు పరీక్ష జరిగే రోజున ఉదయం 8.00 గంటలకు ఆయా కేంద్రాల సీఎస్, డీవోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవాలి. ఉన్నతాధికారులు టెలీకాన్పరెన్స్ ద్వారా ప్రశ్నాపత్రం కోడ్‌ను తెలుపుతారు. దాని ప్రకారంగా సంబంధిత కస్టోడియన్లు ఆయా సెట్ ప్రశ్నాపత్రం బండిల్‌ను ఉదయం 8.30 గంటల తర్వాత స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ అధికారి పర్యవేక్షణలో ఆటోలోగానీ, కారులోగానీ పూర్తి బందోబస్తుతో ప్రశ్నాపత్రాల బండిల్‌ను తరలిస్తారు. ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సరిగ్గా 9.00 గంటలకు సీసీ కెమెరాల నిఘాతో ప్రశ్నాపత్రాల బండిల్స్ సీల్ తీస్తారు. ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు వీక్షించేందుకు అవకాశం ఉంది.
నిమిషం నిబంధన
విద్యార్థి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష జరిగే సమయానికికంటే గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. 30 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్‌ను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.