చింతకాని, మే 3: దళితబంధు లబ్ధిదారుడి ఆదాయం తొలి రోజు రూ.9 వేలు సమకూరింది. రైతు నుంచి ఆ మొత్తాన్ని అందుకున్న క్షణాన ఆ లబ్ధిదారుడి కళ్లు ఒక్కసారిగా చెమర్చాయి. అతడి కుటుంబ సభ్యులు ఆనందపరవశులయ్యారు. ఈ అద్భుత సన్నివేశం చింతకాని మండలంలో మంగళవారం సాక్షాత్కారమైంది. దీంతో సదరు లబ్ధిదారుడిని స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు.
దళితుల అభ్యున్నతి కోసమే..
దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని, దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య పేర్కొన్నారు. మండలంలో నాగిలిగొండ గ్రామంలో దళితబంధు ద్వారా హార్వెస్టర్‌ను అందుకున్న తొలి దళిత సర్పంచ్ చాట్ల సురేశ్.. మంగళవారం దాని ఫలాన్ని కూడా పొందాడు. తన హార్వెస్టర్ ద్వారా తొలి రోజు మూడు ఎకరాల వరిపొలాన్ని కోశాడు. దీంతో అతడికి రూ.9 వేల ప్రతిఫలం వచ్చింది. రైతు గూడురు ప్రతాపరెడ్డి నుంచి లబ్ధిదారుడు సురేశ్ ఆ మొత్తాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాలపుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతలను మారుస్తోందని అన్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలంలో దళితబంధు అమలు ద్వారా 26 గ్రామాల్లోని సుమారు 4 వేల దళిత కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారన్నారు. పభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. అయినా ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారని అన్నారు. మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు. సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్‌రెడ్డి, నాయకులు గడ్డం శ్రీనివాసరావు, పదిలోజు రామకృష్ణ, మామిళ్ల వెంకటరత్నం, కోమ్ము అంబేద్కర్, షేక్ యూసఫ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.