ఖమ్మం రూరల్, మే 3: పాలేరు రైతుల కల సాకారం కాబోతుంది. దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్ కోసం ఎదురుచూసిన వ్యాపారులు, కార్మికులకు ప్రయోజనం చేకూరబోతున్నది. రూ.20 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో మద్దులపల్లి మార్కెట్ నిర్మించనున్నారు. మార్కెట్ పరిధిలో ఖమ్మం రూరల్, తిరుమలయపాలెం మండలాలే ఉన్నా.. పొరుగు జిల్లాలకు సైతం ఈ మార్కెట్ ఆసరాగా నిలవనున్నది. నేడు నేడు రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ నూతన మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
మద్దులపల్లి మార్కెట్ శంకుస్థాపన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. మంగళవారం ఉదయం డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ వరప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. తాగునీరు, షామియానాలు ముందస్తుగానే సమకూర్చుకోవాలని మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు సూచించారు. సభకు వచ్చే రైతులకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్, ఇతర విషయాలపై ఆయన స్థానిక నాయకులతో చర్చించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మల్లీడు అరుణ, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, మార్కెటింగ్ డీఈ సమాధానం తదితరులు పాల్గొన్నారు.
రోల్‌మోడల్‌గా మద్దులపల్లి మార్కెట్
పాలేరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. పాలేరు రైతుల ఆకాంక్షకు అనుగుణంగా నూతన మార్కెట్‌ను సర్కార్ ఏర్పాటు చేస్తున్నది. రోల్‌మోడల్ మార్కెట్‌గా మద్దులపల్లి మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం. గతంతో పోల్చుకుంటే పాలేరు నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట దిగుబడి పెరిగింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్ నిర్మిస్తాం. నూతన వ్యవసాయ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాలేరు రైతులతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల రైతులకూ ప్రయోజనం చేకూరనున్నది. మార్కెట్‌కు అప్రోచ్‌రోడ్, మౌలిక వసతులు కల్పిస్తాం. వ్యాపారులు, కార్మికులు, రైతులకు విశ్రాంతి భవనాలు అందుబాటులోకి తీసుకొస్తాం. -పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి