ఖమ్మం కల్చరల్, మే 3: పసిడి మరింత మెరిసింది. వైశాఖ మాసం బహుళ తదియ మంగళవారం అక్షయ తృతీయ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఈ పండుగ రోజున గ్రాము బంగారం కొనుగోలు చేసినా ఐష్టెశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో పసిడి ప్రియులు బంగారం ఆభరణాలను విరివిగా కొనుగోలు చేశారు. 22 క్యారెట్ల బంగారం ధర 47,800 ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో పుత్తడిని కొనుగోలు చేశారు. దీంతో ఖమ్మం నగరంలోని బంగారు ఆభరణాల షోరూములు, దుకాణాలు క్రయవిక్రయాలతో కిక్కిరిసిపోయాయి. అధిక సంఖ్యంలో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసి తమ తమ ఇండ్లలో లక్ష్మీదేవి పూజలు చేశారు. బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులకు ఆఫర్లు, డిస్కౌంట్లతో విక్రయాలు చేశాయి. పండుగ ముందు రోజు వరకు ధరలో తగ్గుదల ఉన్నప్పటికీ, పండుగ నాడు ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పండుగ తమకు ఎంతో ప్రీతిపాత్రమైనదని, బంగారం కొనుగోలుతో పాటు, లక్ష్మీదేవి పూజలు చేయడం సకల సౌభాగ్యాలు కలిగిస్తాయని పలువురు మహిళలు పేర్కొన్నారు.