ఖమ్మం, మే 2: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఎర్లీ బర్డ్’ స్కీంను అమలు చేస్తున్నది. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నెలలోనే ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ఏకంగా రూ.6.85 కోట్లు వసూలైంది. మధిర మున్సిపాలిటీ నుంచి రూ.51.27 లక్షలు, సత్తుపల్లి నుంచి రూ.1.12 కోట్లు, వైరా నుంచి రూ.21.14 లక్షలు వసూలైంది. ఇలా ఒక్క ఏప్రిల్‌లో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.8.70 కోట్లు వసూలైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 76 వేల ఇండ్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 వరకు 47,159 మంది పన్ను చెల్లించారు. వీరందరూ 5 శాతం రాయితీకి అర్హత సాధించారు. వీరిలో ఏప్రిల్ 30 నాటికి 10,146 మంది ఇంటి యజమానులు ఇంటి పన్ను చెల్లించారు. మధిర మున్సిపాలిటీ నుంచి 5,340 మంది అర్హులు ఉండగా 1,333 మంది ఎర్లీబర్డ్ స్కీం కింద రూ.51.27 లక్షలు ఇంటి పన్ను చెల్లించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మార్చి 31 నాటికి 7,093 మంది ఇంటి పన్నులు చెల్లించి ఎర్లీబర్డ్ స్కీంకు అర్హులు కాగా వీరిలో 1,640 మంది ఏప్రిల్‌లో రూ.1.12 కోట్లు ఇంటి పన్ను చెల్లించారు. వైరా మున్సిపాలిటీలో 4,381 స్కీంకు అర్హులు కాగా వీరిలో 727 మంది రూ.21.14 లక్షల పన్ను చెల్లించారు.
ఇంటి యజమానులకు 5 శాతం రాయితీ..
రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మున్సిపల్ అధికారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేస్తారు. ఏటా ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను లెక్కించి వసూలు చేస్తారు. సాధారణంగా ఏడాదిలో రెండు పర్యాయాలు ఇంటి పన్నులు చెల్లించవచ్చు. ఎక్కువ మంది మార్చి నెలలోనే ఇంటి పన్ను చెల్లిస్తారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మార్చిలో ఇంటి పన్నులు చెల్లించిన వారికి వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నును ఏప్రిల్‌లోనే చెల్లిస్తే సంబంధిత ఇంటి పన్నులో 5 శాతం రాయితీ ఇస్తున్నది. గతేడాది కరోనా సమయంలోనూ ప్రభు త్వం ఏప్రిల్, మే నెలల్లో ఎర్లీ బర్డ్ స్కీం అమలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో మాత్రమే అవకాశం ఇవ్వడంతో ఇంటి యజమానులు స్కీంను సద్వినియోగం చేసుకుని ఇంటి పన్ను చెల్లించారు.
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో..
ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 76 వేల గృహాలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.25.15 కోట్ల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.21.51 కోట్లు వసూలైంది. మరో రూ.3.64 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నగరపాలక సంస్థ ఇంటి పన్ను వసూలు లక్ష్యంలో 85.52 శాతం వసూలు చేసి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం కింద కార్పొరేషన్లో ఇంటి పన్ను రూ.3.12 కోట్లు వసూలు కాగా గతేడాది ఏప్రిల్, మే నెలల్లోనూ ఎర్లీబర్డ్ స్కీం అమలైంది. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే స్కీం కింద రూ.6.85 కోట్లు వసూలైంది. గతేడాది కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో ఇంటి పన్ను వసూలు కావడం గమనార్హం.
రికార్డు స్థాయిలో వసూలు..
ఎర్లీబర్డ్ స్కీమ్‌లో భాగంగా ఇంటి పన్నుల చెల్లింపులో 5 శాతం రాయితీపై ఇంటి యజమానులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఇదే స్థాయిలో బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది చాలా కష్టపడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు. పేర్లు తప్పులు పడడం, ఇంటి పన్ను ఎక్కువగా చూపించడం వంటి చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాం. ఈ కారణంతోనే ఒక్క నెలలోనే రూ.6.85 కోట్లు వసూలు చేయగలిగాం.
– ఆదర్శ్ సురభి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్