ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్/రామవరం, మే 2: ముస్లింలకు ఎంతో ప్రీతికరమైన పండగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్). మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్లింలు పండుగ సందర్భంగా ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థన చేయ నున్నారు. సోమవారం రాత్రి నెల పొడుపు కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలు విరమించారు. పండుగ రోజు ధనికులు పేదలు అన్న తారతమ్యం లేకుండా ముస్లింలంతా సహృదయాలతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. ఇళ్లలో బంధు మిత్రులకు సేమ్యా, ఖీర్ అందిస్తారు. ఈద్గాహ్లు, మసీదుల వద్ద ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు సామూహిక ప్రార్థనలు నిషేధం ఉండడంతో ముస్లింలో ఇళ్లకు పరిమితమై ప్రార్థన చేసుకున్నారు. ఈసారి కొవిడ్ ప్రభావం లేకపోవడంతో నిర్వాహకులకు ప్రార్థనలకు భారీగా ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సోమవారం ఖమ్మం, కొత్తగూడెంతో ఇతర మున్సిపాలిటీల్లోని వ్యాపార సముదాయాలన్నీ వస్ర్తాలు, సేమియా, డ్రైఫ్రూట్స్ కొనేవారితో సందడిగా కనిపించాయి.
ఫిత్రా..
జకాత్తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు పూటల తిండికి, బట్టకు నోచుకోని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అభాగ్యులు, నిరుపేదలకు పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం ఉద్బోధిస్తుంది. దీనినే ఫిత్రాదానం అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు దానం చేస్తారు. 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలు లేదా దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలు లేదా దానికి సమానమైన ధనాన్ని దానమిస్తారు.
జకాత్..
రంజాన్ నెలలో ముస్లింలు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. సంపాదనాపరులు జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తున్నది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. నిరుపేదలు పండుగ జరుపుకోవడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు జకాత్ ఉపయోగపడుతుంది.