ఖమ్మం వ్యవసాయం, మే 1:‘కార్మికులకు కొండంత అండ.. గులాబీ జెండా.. శ్రామికుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతున్నది. వారు, వారి కుటుంబాల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల బీమా పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచింది.. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు ఏర్పడ్డాయి.. తద్వారా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ నగరంలోని ప్రతి వాడను బంగారువాడగా తీర్చిదిద్దుతున్నాం.. అందుకు ఓర్వలేకే జాతీయ పార్టీలు తనపై అక్కసు వెల్లగక్కుతున్నాయి.. శవ రాజకీయాలకు తెరలేపాయి.. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అభివృద్ధికి బ్రేక్ పడదు.. స్పీడ్ తగ్గదు..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో 500 వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రజలు, కార్మికులు మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఘనంగా ‘మే డే’ జరిగింది. కార్మికులు, ఉద్యోగులు జెండా లను ఆవిష్కరించారు. వక్తలు మే డే విశిష్ట తను వివరించారు. శ్రామికులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు..
కార్మికులకు కొండంత అండ గులాబీ జెండా అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తొలుత వ్యవసాయ మార్కెట్ వద్ద ట్రాలీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జడ్పీ సెంటర్లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతున్నదన్నారు. కార్మికులు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రూ.2 లక్షల బీమా పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు ఏర్పడ్డాయన్నారు. తద్వారా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. నగరంలో ప్రతివాడను బంగారువాడగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే జాతీయ పార్టీలు అక్కసు వెల్లగక్కుతున్నాయని మండిపడ్డారు. నగరంలో శవ రాజకీయాలకు తెరలేపాయ
న్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అభివృద్ధికి బ్రేక్ పడదన్నారు. ప్రజలు మతోన్మాద శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు, నగరవాసులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్మిక సంఘం నాయకులు నున్నా, మధావరావు, పాల్వంచ కృష్ణ, నాయకులు ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, బుర్రి వినయ్, పాషా, కొల్లు పద్మ, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, గొడవర్తి శ్రీనివాసరావు, వర్తక సంఘం వ్యాపారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
500 వాహనాలతో టీఆర్ఎస్కేవీ ర్యాలీ..
నగరంలో తొలిసారిగా టీఆర్ఎస్కేవీ 150 ట్రాలీలు, 200 ద్విచక్ర వాహ నాలు, 150 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయం నగరంలోని సుందరయ్యనగర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ గ్రెయిన్ మార్కెట్, మూడు బొమ్మల సెంటర్, హర్కారాబావి సెంటర్, గాంధీచౌక్, నయాబజార్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్‌కు చేరుకుంది. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో త్రీటౌన్ ప్రాంతంలో ఎడ్లబండి కార్మికులు, గాంధీచౌక్ ప్రాంతంలో హమాలీలు, దాల్మిల్, రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజీ కార్మికులు టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. పాతబస్టాండ్, నయాబజార్, కొత్త బస్టాండ్, ముస్తఫానగర్, జడ్పీ సెంటర్లో ఆటోయూనియన్, మెకానిక్‌లో అసోసియేషన్, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్ సంఘం నాయకులు జెండాను ఆవిష్కరించారు.