లక్ష్మీదేవిపల్లి, మే 1: ప్రకృతి సంపద తునికాకు (బీడీ ఆకు). ప్రతి వేసవిలో గిరిజనులకు ఇది నెలరోజుల పాటు ఆదాయ వనరు. తునికాకు సేకరించడం.. కట్టలు కట్టడం, వాటిని కల్లాల్లో ఆరబెట్టి వాటిని కాంట్రాక్టర్లకు విక్రయించి ఉపాధి పొందుతారు. ఈసారి కూడా వేసవి వచ్చేసింది. అటవీ శాఖ తునికాకు సేకరణకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రూనింగ్ (మండలు కొట్డడం) ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తునికాకు సేకరించేందుకు రంగం సిద్ధమైంది. ఆకు సేకరణతో గిరిజనులకు సుమారు ఏడాదిలో నెలరోజుల పాటు చేతినిండా పని దొరుకుతుంది. వేసవి ప్రారంభం కాగానే మొదట ప్రూనింగ్ ప్రక్రియ (మండలు కొట్టడం) చేపడతారు. 40 రోజుల తర్వాత ఆకు ఏపుగా చిగురించి కోతకు వస్తుంది. ఏపుగా పెరిగిన ఆకును కార్మికులు చెట్టు పుట్ట తిరిగి సేకరిస్తారు. సేకరించిన ఆకులను ఆరబెడతారు. కొన్నిరోజుల తర్వాత ఉల్టా పల్టా (ఒకవైపు ఆరిన ఆకును మరోవైపు తిప్పడం) చేపడతారు. ఆరిన ఆకులను బస్తాల్లో నింపుతారు. లారీల ద్వారా మార్కెట్‌కు తరలిస్తారు.
ఆరు డివిజన్ల పరిధిలో ఆకుల సేకరణ
జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని డివిజన్లు, కొత్తగూడెం, చండ్రుగొండ, రామవరం, టేకులపల్లి, జూలూరుపాడు, ఇల్లెందు, కొమరారం, గుండాల, కాచనపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, పాల్వంచ, అశ్వాపురం, ఇబయ్యారం, మణుగూరు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, చాతకొండ, అద్దాలపల్లి, రేగళ్ళ, యానంబైలు రేంజీల పరిధిలోని 30 యూనిట్లలో పనులు జరుగనున్నాయి. ఆళ్లగూడెం, కొమ్మనపల్లి, చర్ల, దేవరపల్లి, దుమ్ముగూడెం రేంజీలోని 32 కల్లాలకు 9,700 స్టాండర్డ్ బ్యాగులు, మణుగూరు డివిజన్లో బూర్గంపాడు, బయ్యారం, కరకగూడెం, మణుగూరు, కరకగూడెం ఏ, కరకగూడెం బీ పరిధిలోని 110 కల్లాలకు 5,400 స్టాండర్డ్ బ్యాగ్‌లు, పాల్వంచ డివిజన్ పరిధిలో గుండాలపాడు, నాగుపల్లి, పాల్వంచ, ములకపల్లి రేంజీ పరిధిలో 136 కల్లాలకు 2,300 స్టాండర్డ్ బ్యాగులు, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్లోని యానంబైలు ఏ, బీ, సీ, డీ, పాల్వంచ ఏ రేంజీ పరిధిలో 53 కల్లాలు ఉండగా 3,200 స్టాండర్డ్ బ్యాగులు, కొత్తగూడెం డివిజన్ పరిధిలో కనకగిరి, గంగారం, రామవరం రేంజీలు ఉండగా 81 కల్లాలకు 3,900 స్టాండర్డ్ బ్యాగులు, ఇల్లెందు డివిజన్ పరిధిలోని గుండాల, కరణిగూడెం, సవనపల్లి, కాచనపల్లి, కొమరారం, సత్తపల్లి, ధనియాలపాడు, సూదిమళ్ల రేంజ్‌లు ఉండగా 167 కల్లాలకు 10,600 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది.
చెల్లింపులు ఇలా..
ప్రతి 50 ఆకుల కట్టకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ద్వారా రూ.1.50 పైసలు చెల్లించనున్నది. ఆకు సేకరణకు వయస్సుతో సంబంధం లేకుండానే పిల్లలు, పెద్దలు, వృద్ధులకు అవకాశం ఉన్నది. ఒక్కో కార్మికుడు రోజుకు 100 కట్టల నుంచి 500 కట్టల వరకు వారి శక్తిని బట్టి కోయగలుగుతారు. తక్కువలో తక్కువ ఒక్కో కార్మికుడు రోజుకు రూ.200 నుంచి రూ.600 వరకు ఆదాయం పొందుతారు. ఆకు సేకరణకు 35,100 స్టాండర్డ్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.
లక్ష సాధనకు చర్యలు..
ఈ ఏడాది అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది నాణ్యత గల తునికాకు అందుబాటులో ఉంది. ఆకు సేకరణ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆకు సేకరణలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కోతకు వెళ్లాలి. తెల్లవారుజామున ఆకు సేకరణకు వెళ్లి 10 గంటలలోపు తిరిగి ఇంటికి వచ్చేయాలి.
– డీఎఫ్‌వో రంజిత్‌నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నెలరోజుల పాటు ఉపాధి
వేసవిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మాకు తునికాకు సేకరణ ఉపాధినిస్తుంది. నెల రోజుల పాటు పని దొరుకుతుంది. మేమంతా ప్రతిరోజు తెల్లవారుజామునే అడవికి వెళ్తాం. తునికాకు సేకరించి ఎండ ముదరకముందే ఇంటికి చేరుకుంటాం. కుటుంబమంతా కలిసి కూర్చొని తునికాకులను కట్టగడతాం. సాయంత్రం ఆకులను విక్రయిస్తాం.
– వజ్జా మోహన్, బొజ్జలగూడెం