ఖమ్మం ఎడ్యుకేషన్, మే 1: విద్యారంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి/ మన ఊరు-మన బస్తీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు ఇంగ్లిష్ బోధన అందించనున్నది. అందుకు అనుగుణంగా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి మొదటి విడతో 426 స్కూల్స్ ఎంపిక చేసింది. వేసవి సెలవుల్లో పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నది. అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ పర్యవేక్షకులను నియమించింది. ఉమ్మడి జిల్లాకు సమగ్ర శిక్షణ జాయింట్ డైరెక్టర్ బీ వెంకటనర్సమ్మ నియమితులయ్యారు.
వైరా మినహా అన్ని మండలాల్లో…
జిల్లాలోని వైరా మండలం మినహా అన్ని మండలాల్లో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగాయి. 426 పాఠశాలలను ఏడు ఇంజినీరింగ్ విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించారు. వైరా మండలాన్ని మొదట ఆర్‌డబ్ల్యూఎస్‌కు, తర్వాత ఆర్అండ్బీ కేటాయించగా పనులకు సంబంధించిన అంచనాలు సిద్ధం కాకపోవడంతో ఈ మండలాన్ని విద్యాశాఖ పరిధిలోని ఈడబ్ల్యూఐడీసీ కేటాయించారు. ప్రస్తుతం అంచనాలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో మండలంలోని స్కూళ్లకూ అనుమతులు రానున్నాయి.
27 స్కూల్స్‌కు అనుమతులు…
ఖమ్మం నియోజకవర్గం అర్బన్‌లోని రోటరీనగర్ పాఠశాల, రఘునాథపాలెం మండలంలోని రాంక్యాతండా పాఠశాల, ఖమ్మం రూరల్‌లోని పెద వెంకటగిరి, కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, నేలకొండపల్లి మండలంలోని సింగారెడ్డిపాలెం, తిరుమలాయపాలెం మండలంలోని మర్రితండా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలోని చింతగూడెం, వేంసూరు మండలంలోని పల్లెవేద, సత్తుపల్లిలో రేగళ్లపాడు, సిద్దారంకాలనీ, అయ్యగారిపేట, కల్లూరు మండలంలోని కల్లూరు, తల్లాడ మండలంలోని మల్లారం, కొండవాటిమెట్ట పాఠశాల, మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలోని రామచంద్రాపురం, పెద్దగోపవరం, బోనకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి, మధిర మండలంలోని వంగవీడు, మోటూరుపేట, ముదిగొండ మండలంలోని గంధసిరి, చింతకాని మండలంలోని వందనం, కోమట్లగూడెం పాఠశాలలు, వైరా నియోజకవర్గం కారేపల్లి మండలంలోని గాదేపాడు, కొమ్ముగూడెం, కొణిజర్ల మండలంలోని తుమ్మలపల్లి, ఏన్కూరు మండలంలోని గార్లొడ్డు పాఠశాలలకు అనుమతులు వచ్చాయి.
నేటి నుంచి పరిశీలన..
అబ్జర్వర్‌గా నియమితురాలైన బి.వెంకటనర్సమ్మ సోమవారం నుంచి ఈనెల 10 వరకు ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పనులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. అభివృద్ధి పనులపై సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పనుల బడ్జెట్‌తో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్లూ పాల్గొననున్నారు. జిల్లా అబ్జర్వర్‌గా ఉమ్మడి జిల్లాకు నియమితురాలైన వెంకట నర్సమ్మ గతంలో ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఈవోగా, రాజీవ్ విద్యామిషన్ పీవోగా, డీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.