అశ్వాపురం, మే 1 : సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు/బస్తీ -మన బడి అనే కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను చేపడుతున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం అశ్వాపురం మండలంలోని కల్యాణపురం, మిట్టగూడెం పాఠశాలల్లో రూ.17 లక్షలతో పలు అభివృద్ధి పనులు, గొల్లగూడెం పంచాయతీలో చింతిర్యాల క్రాస్‌రోడ్‌లో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో పాఠశాలకు 12 రకాల మౌలిక వసతులు, ఆహ్లాదభరితమైన పాఠశాల వాతావరణం, అధునాతన తరగతి గదులు, ప్రహరీ, టాయిలెట్స్, వంటశాలలు, బెంచీలు, కరెంటు, ఇతర సదుపాయాలు, డిజిటల్ తరగతులు, ప్రత్యేక శిక్షణ ఆంగ్ల బోధనతోపాటు తెలుగు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మిట్టగూడెంలో మృతిచెందిన కొర్సా నర్సింహారావు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు సాయం అందించారు. మొండికుంట టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మన్మథరెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో అశ్వాపురం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలుశాఖల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి
మణుగూరు రూరల్, మే 1 : పాఠశాలల అభివృద్ధికి విరాళాలు అందించే దాతలు ముందుకురావాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరు మండలం సమితిసింగారంలోని అశోక్‌నగర్, శ్రీశ్రీనగర్, శ్రీసాయి నగర్ పాఠశాలల్లో మొత్తం రూ.40 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2 లక్షలు ఇస్తే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకోవచ్చని, రూ.పది లక్షలు ఇస్తే తరగతి గదికి పేరు, కోటి విరాళంగా అందిస్తే పాఠశాలకు వారి పేరును పెడతామని చెప్పారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వీరస్వామి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, కుర్రి నాగేశ్వరరావు, పట్టణ, మండల అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యంబాబు, బొలిశెట్టి నవీన్, రామిడిరామిరెడ్డి, బాబ్జాన్, నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, అడపా వెంకటేశ్వర్లు, సర్పంచ్ బచ్చల భారతి, ఈవోఆర్డీ పల్నాటి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ అధికారి రమేశ్ పాల్గొన్నారు.