సత్తుపల్లి, మే 1 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గవ్యాప్తంగా 233 మందికి రూ.1.26 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తెలంగాణ వచ్చిన తర్వాత, రాకముందు పరిస్థితులను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 12గ్రామాల్లో నిర్మించిన 444 డబుల్ బెడ్రూం ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.59 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, సింగరేణి, ఎయిర్ ఇండియా తదితర సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా పట్టించుకోకుండా పేదలపై భారం మోపుతూ మరోపక్క కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంస్థలను అప్పగించి వారికి వత్తాసు పలుకుతున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ గాదె సత్యం, తుంబూరు కృష్ణారెడ్డి, షేక్ రఫీ, మల్లూరు అంకమరాజు, వెల్ది జగన్మోహనరావు, గండ్ర సోమిరెడ్డి, కౌన్సిలర్లు షేక్ చాంద్‌పాషా, మట్టా ప్రసాద్, కంటే నాగలక్ష్మి, నడ్డి జమలమ్మ, మందపాటి పద్మజ్యోతి, రఘు, పాలకుర్తి సునీతారాజు, ధనుంజయ, జువ్వాజి అప్పారావు, మందపాటి వాసురెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.