చుంచుపల్లి, ఏప్రిల్ 30:ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినిపించే, కనిపించే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఆరోగ్యం కోసం ఈ పండునే ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది మన ప్రాంతంలో పండే పంట కాదు. బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తెప్పించుకుంటున్నారు. దానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ధర కూడా ఎక్కువే. అందుకే మనోళ్లు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు ఈ పంటను ఎలా సాగు చేయాలి? ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఖర్చు ఎంత అవుతుంది? అసలు పంట ఏ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది? అనే విషయాలను ఉద్యానశాఖ చెబుతోంది.
దీంతో జిల్లాలో ఉన్న చాలా మంది రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రభుత్వం అందించే సబ్సిడీని అందిపుచ్చుకొని రైతులు ఈ పంట సాగుపై దృష్టి సారించారు. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనడానికి సగటు మానవుడికి తగినంత శక్తి అవసరం. వీటన్నింటినీ తట్టుకోవడానికి ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తదితర పోషకాలు అవసరం. ఇవన్నీ ఈ పండులో ఉండడంతో దీనికి విపరీతమైన గిరాకీ ఉంటోంది. మన జిల్లాలో ఈ పంటను పండించడానికి అనువైన వాతావరణం, నేలలు ఉన్నాయి.
డ్రాగన్ పండ్లకు డిమాండ్
డ్రాగన్ ఫ్రూట్‌ను అధికంగా వైన్, జ్యూస్, సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు. దీంతో ఆ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఇది సహజ సేంద్రియ సాగు పండు. పోషకాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎరుపు రంగు పండ్లలో విటమిన్ -సీ, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, మొదలైన పోషకాలు ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. అలంకరణ మొక్కగా, పండ్ల మొక్కగా కూడా దీనిని పరిగణిస్తారు. పండును నేరుగా గానీ, జామ్‌గా గానీ, జెల్లీగా గానీ, రసంగా గానీ తీసుకోవచ్చు. వైన్, ఐస్క్రీంలలో విరివిగా వినియోగిస్తారు. బ్యూటీపార్లర్లలో ఫేస్ ప్యాక్‌గా, పండ్ల రంగును సహజసిద్ధ లిప్‌స్టిక్‌గా వాడుతారు. కాస్మొటిక్స్‌లలో వినియోగం అధికంగా ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వాటిని తగ్గిస్తుంది. అధిక మోతాదులో మాంసకృత్తులు, మంచి కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కీళ్ల వాతాన్ని తగ్గిస్తుంది.
నేలలు అనుకూలం..
భద్రాద్రి జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులు కమలం (డ్రాగన్ ఫ్రూట్) సాగుకు అనుకూలమైనవి. తక్కువ నీటి సౌలభ్యం ఉన్న నేలల్లోనూ ఈ పంటను పండించుకోవచ్చు. నాలుగేళ్ల వయసు నుంచి ఎకరానికి 12 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా 30 ఏళ్ల వరకు దిగుబడి పొందే వీలుంది. ప్రస్తుతం ఈ పండ్లకు మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ధర పలుకుతోంది. ప్రతి రైతూ ఇటువంటి లాభాలను పొందొచ్చు.
పంటపై అధ్యయనం చేశా..
రెండు ఎకరాల్లో నేను ఈ పంటను సాగు చేస్తున్నాను. వివిధ రాష్ర్టాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటలపై అధ్యయనం చేశాను. దీని సాగు ఎంతో మేలు అని తెలుసుకున్నాను. రాబోయే రోజుల్లో ఈ పంటకు మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో 20 శాతం మంది మాత్రమే ఈ పంటను పండిస్తున్నారు. అధికా రుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను.
–సుధీర్ కామదాని, డ్రాగన్ ఫ్రూట్ రైతు, దమ్మపేట
భవిష్యత్తులో విస్తీర్ణం పెరుగుతుంది..
జిల్లాలోని కొద్దిమంది రైతులు ఇప్పుడిప్పుడే ఈ పంట గురించి తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ పంట సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ పంట సాగు గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎకరానికి రూ.64 వేల సబ్సిడీ వస్తుంది. జూన్‌లో ఈ పంటను నాటుకోవాలి. ఔషధ గుణాలున్న మొక్క కావడంతో గిరాకీ బాగా ఉంటుంది.
–జినుగు మరియన్న, జిల్లా ఉద్యాన అధికారి