ఖమ్మం జిల్లా సర్కారు దవాఖానలో మదర్ మిల్క్ బ్యాంక్, శవ పరీక్ష గది ప్రారంభం
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శనివారం రూ.75 లక్షలతో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్, రూ.30 లక్షలతో నిర్మించిన శవ పరీక్ష గదిని ప్రారంభించి అనంతరం రూ.70 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తల్లిపాలు బిడ్డలకు శ్రేష్ఠమైనవని, తక్కువ బరువుతో జన్మించే బిడ్డలకు తల్లిపాలు పట్టించాలనే లక్ష్యంతో మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. ఈ వసతి ఇప్పటివరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉండేదని, ఇప్పుడు ఖమ్మం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఆసుపత్రికి రోగుల తాకిడి బాగా పెరిగిందని, వారికి అనుగుణంగా వసతులు కల్పిస్తున్నామన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రభుత్వాసుపత్రులు బాగుపడ్డాయని, దీనిలో భాగంగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మతా శిశు సంరక్షణ కేంద్రం, డయాగ్నస్టిక్ హబ్, హృద్రోగుల కోసం క్యాథ్లాబ్, సిటీ స్కాన్ ఏర్పాటయ్యాయన్నారు. ఆసుపత్రి 500 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందిందన్నారు. నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాలు, సిబ్బంది క్వార్టర్లు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయి మెడికల్ కళాశాలగా ఆసుపత్రి విరాజిల్లుతుందన్నారు. రేడియాలజీ భవనం ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారం మరువలేనిదన్నారు.
అంతకుముందు పెద్దాసుపత్రికి వచ్చిన మంత్రి, జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎంహెచ్‌వో మాలతితో మదర్ మిల్క్ బ్యాంక్‌లోని ఒక్కో విభాగాన్ని ప్రారంభింపజేశారు. ఈ క్రమంలో బిడ్డకు టీకా కోసం వచ్చిన ఓ తల్లి దగ్గరకు మంత్రి వెళ్లారు. బిడ్డను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు. బిడ్డ ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. నర్సింగ్ విభాగం సూపరింటెండెంట్ సుగుణ దవాఖాన ఆవరణలో నైటింగేల్ విగ్రహ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో శ్రీనివాసరావు, ఏవో కేసగాని రాజశేఖర్‌గౌడ్, పరిపాలన అధికారి ఆర్వీఎస్ సాగర్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.