ఖమ్మం, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు మున్సిపాలిటీలకే పరిమితమైన టీఎస్ బీపాస్‌ను ఇక నుంచి గ్రామపంచాయతీల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. దీంతో ఖమ్మం జిల్లాలో 589 గ్రామపంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 389 పంచాయతీల్లో టీఎస్ బీపాస్ అమల్లోకి రానున్నది. ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.. అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లోనే అనుమతులు రానున్నాయి.
మున్సిపాలిటీలకు పరిమితమైన టీఎస్ బీపాస్ విధానం ఇకపై నుంచి గ్రామపంచాయతీలోనూ అమలు కానున్నది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ నూతన విధానంపై మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామపంచాయతీల్లో నివాస గృహాలను కొత్తగా నిర్మించుకునే వారికి చేసే అనుమతులను టీఎస్ బీపాస్ విధానంలో మంజూరు చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక గ్రామ పంచాయతీల పరిధిలో నివాసగృహాల నిర్మాణానికి అనుమతి తప్పనిసరి. ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. లేకపోతే తిరస్కరణకు గురైనట్లుగా భావించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి పంచాయతీలో దరఖాస్తు చేసుకునేవారు. కార్యదర్శి పరిశీలించి ఈ-పంచాయతీ ద్వారా అనుమతులు ఇచ్చేది. అయితే, కొత్త విధానంలో ప్రభుత్వ ఆమోదిత లే అవుట్ ఉండాలని నిబంధన విధించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఓనర్షిప్ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ తదితర పత్రాలను నిర్మాణదారులు జతచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 75 చదరపు గజాల లోపు ఇంటి నిర్మాణం చేయదలుచుకుంటే అనుమతులు అవసరం లేదు. అంతకుమించితే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం ఖమ్మం జిల్లాలోని 589 గ్రామ పంచాయితీల్లో భద్రాద్రికొత్తగూడెం 389గ్రామ పంచాయితీల్లో తక్షణం అమలు చేయాలని పంచాయతీరాజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారులు కార్యదర్శులకు దశలవారీగా శిక్షణ ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ స్థాయిలో నిర్మాణాలను పకడ్బందీగా కొనసాగించేలా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. గ్రామపంచాయతీల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాణదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్ని రకాల అనుమతులు ఒకేసారి లభించే అవకాశం ఉండడంతో సమయం కలిసి వస్తుందనే అభిప్రాయం నిర్మాణదారుల్లో వ్యక్తమవుతోంది.
టీఎస్ బీపాస్ అమలుకు చర్యలు
జిల్లాలో టీఎస్‌బీపాస్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో టీఎస్ బీపాస్ విధానం అమలుపై శిక్షణ తరగతులు ఇవ్వాలని భావిస్తున్నాం.
–సీఈవో వింజం అప్పారావు