ఖమ్మం, ఏప్రిల్ 30: పల్లె.. పట్టణం.. నగరం ఏదైనా నువ్వే వాటి అభివృద్ధికి శ్రమ దాతవు.. పరిశ్రమ.. పంట భూమి.. భూగర్భ గనులు.. ఇటుక బట్టి.. ఎక్కడైనా నువ్వే శ్రమ శక్తివి.. అంతటా నువ్వే… అన్నింటా నువ్వే.. నీవు చిందించే చెమట చుక్కలకు వెలకట్టే షరాబు లేడు.. నీవు లేనిదే ప్రపంచ గమనం లేదు.. అందుకే ఓ కార్మికుడా.. నీకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ‘ప్రపంచ కార్మికులరా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అని ఎలుగెత్తి చాటాడు కార్ల్‌మార్క్స్. ఈ నినాదం నాడు పోరు నినాదమై ప్రపంచ కార్మికులను ఆకర్షించింది. ఇదే స్ఫూర్తితో 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు శ్రమశక్తికి తగిన గుర్తింపు, పనికి తగిన వేతనం, పనిగంటల తగ్గింపు డిమాండ్‌తో పారిశ్రామికవేత్తలపై తిరగబడ్డారు.
రోజుకు 18 గంటలు, 16 గంటలు పని చేయలేమని, బానిసత్వంతో బతకలేమని నినదించారు. ఈ పోరాటంలో నాటి బూర్జువా వర్గం కొందరు వందలాది మంది కార్మికులను పొట్టనపెట్టుకున్నది. ఈ పోరాటం తర్వాతే ప్రపంచ కార్మికులు రోజుకు 8 గంటల హక్కును సాధించుకున్నారు. నాటి అమరుల త్యాగానికి ప్రతీక ‘మే డే’. ఏటా మే 1వ తేదీన ‘ప్రపంచ కార్మికుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ఆదివారం ఉమ్మడి జిల్లాలో కార్మికులు ఘనంగా కార్మిక దినోత్సవం నిర్వహించనున్నారు.
ఆర్టీసీ, విద్యుత్, సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కార్మిక జెండాలను ఆవిష్కరించనున్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగ నాయకులు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి మంత్రి అజయ్‌కుమార్ హాజరుకానున్నారు. నాయకులు తొలుత నగరంలోని ప్రధాన సెంటర్లలో జెండాలు ఎగురవేసి నయాబజార్ కళాశాల వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరుతారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో పాటు సుమారు 5వేల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా.