
అది శతాబ్దాల సమస్య. మునుపెన్నడూ ఎవరూ గుర్తించని సమస్య. గమనించినా ఆచరణలో పెట్టని సమస్య. ఆసాములకే ఆ సౌకర్యం అనే భావన కలిగించిన సమస్య. అదే.. ‘కల్లం’ సమస్య. ఆ సమస్యను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆ సమస్యతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడకూడదని సంకల్పించింది. పంట చేతికి వచ్చాక.. ‘ఎక్కడ ఆరబెట్టుకోవాలి? ఎక్కడ కల్లం చేయాలి?’ అనే వరి, కంది, పెసర వంటి సమస్యలకు చరమగీతం పాడింది. కల్లాలు భూస్వాములకు, ఆసాములకు మాత్రమే కాదని.. చిన్న రైతులకూ ఉంటాయని నిరూపించింది. రైతుల భూముల్లో నిర్ణీత విస్తీర్ణంలో కాంక్రీటుతో కల్లాల ప్లాట్‌ఫాం నిర్మించి ఇస్తోంది.
కూసుమంచి, ఆగస్టు 17: రైతు సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్.. కల్లాల సమస్యకు చెల్లుచీటీ ఇవ్వాలని తలచారు. ఈజీఎస్ కింద రైతులకు తమ పొలాల్లో కాంక్రీటుతో కల్లాన్ని ప్లాట్‌ఫాంలా నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో రైతులు ఉప్పెనలా దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు 4,094 కల్లాల లక్ష్యం కాగా.. 4,437 మందికి మంజూరు చేశారు. 110 శాతం మందికి వారి సొంత భూముల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 20 మండలాల్లో 950 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. గత యాసంగి నాటికే 350 కల్లాలు పూర్తయ్యాయి.
అత్యధికంగా సింగరేణి మండలంలో..
అత్యధికంగా సింగరేణి మండలంలో కల్లాలు మంజూరయ్యాయి. ఈ మండలంలో 358 కల్లాలు లక్ష్యం కాగా 352 మంజూరు చేశారు. అత్యల్పంగా వైరాలో 127 లక్ష్యం కాగా 122 మంజూరయ్యాయి.
మూడు రకాలుగా ప్లాట్‌ఫాంలు..
కల్లాల ప్లాట్పాంలను ప్రభుత్వం మూడు రకాలుగా విభజించింది. వాటిల్లో మొదటిది 50 మీటర్లు 538 ఎస్ఎఫ్టీ కల్లం నిర్మాణానికి రూ.56,000. రెండోది 60 మీటర్లు 645 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి రూ.68,000. మూడోది 75 మీటర్లు 807 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి రూ.85,000 కేటాయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ. బీసీ, ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ. కల్లాల ప్లాట్‌ఫాంల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఉపాధి హామీ జాబ్‌కార్డు జత చేసి ఉపాధి హామీ సిబ్బందికిగానీ, ఏఈవోగానీ ఇవ్వాలి.
ఇబ్బంది తొలగిపోయింది..
నేను గతంలో కల్లం పెట్టాలంటే బండకు పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నా చేను కాడనే కల్లం కట్టించుకున్నా. ఏ ఇబ్బందీ లేదు. మొన్న యాసంగి పంటను అక్కడే ఆరబోశా. నాతోపాటు చుట్టూ ఉన్న మరికొంతమంది రైతులు కూడా అక్కడే ఆరబోసిండ్రు. ఇదివరకు చాలా ఇబ్బంది ఉండేది. ఎక్కడో పోసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.
-నెల్లూరి వెంకన్న, రైతు, కూసుమంచి
దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం..
కల్లాల ప్లాట్‌ఫాంలు కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ మంజూరు చేశాం. చాలా మంది రైతులు యాసంగికి సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మరింత మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కూసుమంచి మండలంలో 259 లక్ష్యం కాగా 256 ప్లాట్‌ఫాంలు మంజూరు చేశాం. రూ.1.97 కోట్ల నిధులొచ్చాయి.
-కరుణ, ఈసీ
రైతులకు ఎంతో ఉపయోగం..
రైతులు గతంలో కల్లాలు చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది. లేకపోతే రోడ్లపై కల్లం వేసే వారు. కానీ ప్రస్తుతం కల్లాలు సొంత భూముల్లో చేసుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈజీఎస్ కింద 50, 60, 75 మీటర్ల చొప్పున ప్లాట్‌ఫాంలు నిర్మిస్తున్నాం. కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయశాఖ, ఈజీఎస్లు నిర్మించి ఇస్తాయి.
-విజయ్‌చంద్ర, ఏడీఏ