కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 30: ‘హలో.. మీరు ఎగ్స్ ట్రే యూనిట్ తయారీ ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేశారు కదా? అనుమతుల మంజూరుకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు ఆ విషయం తెలుసా? మీ దరఖాస్తును తిరస్కరించి నెల రోజులు అవుతుంది కదా.. అన్ని డాక్యుమెంట్లు తిరిగి ఎందుకు దరఖాస్తు చేయలేదు?’ అంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేశారు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశయ్యారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వచ్చిన అనుమతులు మంజూరు, టీ ప్రైడ్ పథకంలో టీఎస్పీ, ఎస్పీపీ ద్వారా మంజూరు చేసిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు వంటి అంశాలపై రెవెన్యూ, విద్యుత్, ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షించారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 30 వరకు పరిశ్రమలు ఏర్పాటుకు 35 మంది ఔత్సాహికులు దరఖాస్తు చేశారని, వచ్చిన దరఖాస్తుల్లో అనుమతుల మంజూరు కోసం ఆయా శాఖలకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. 35 దరఖాస్తుల్లో 31 యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని, ఒక దరఖాస్తుకు అభ్యంతరం వ్యక్తమైందని, రెండు దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయని, ఒక దరఖాస్తు తిరస్కరణకు గురైందని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సీతారాం, ఎల్డీఎం శ్రీనివాస్, మైనింగ్ ఏడీ జయ్సింగ్, ఎంవీఐ జయపాల్రెడ్డి, పీసీబీ ఈఈ రవిశంకర్, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.