భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొలువు మేళా ప్రారంభమైంది. యువత కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ల పరంపర కొనసాగిస్తున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖలో 16,614 ఉద్యోగాలు, గ్రూప్-1లో 503, ఎక్సైజ్, రవాణా 677 ఖాళీలకు అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో ఉద్యోగార్థులు ఉత్సాహంగా కొలువులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నగరం, పట్నాలకు వెళ్లి కోచింగ్ కేంద్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా.. మరికొందరు ఇంటిపట్టునే ఉంటూ కొలువు కొట్టేందుకు ప్రణాళిక ప్రకారం చదువుతున్నారు.
లక్ష్యం సాధించేందుకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కాగా, రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం యువతకు ఇది సువర్ణ అవకాశామని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం నియామకాలు చేపట్టనుండగా.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయంటున్నారు. కొలువే లక్ష్యంగా సాధన చేస్తే విజయం దరి చేరుతుందని భరోసా ఇస్తున్నారు.
కష్టపడితే కొలువు సాధించడం సులువేనని, ప్లానింగ్‌తో ప్రిపేర్ అయితే పక్కాగా విజయం సాధించవచ్చని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. వేల ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడం నిరుద్యోగులకు వరంలా మారింది. దీంతో ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు వెంటనే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో గ్రంథాలయాలు కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరి జిల్లాలో వారికే కోచింగ్ ఇచ్చేలా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.
పోలీసు కొలువులు సాధించేందుకు భద్రాద్రి జిల్లాలో 761 మందిని స్క్రీనింగ్ చేసి వారికి రాత పరీక్ష పూర్తి చేశారు. వారిలో అర్హులకు జిల్లా కేంద్రంలోనే కోచింగ్ ఇవ్వనున్నారు. దీంతోపాటు గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఒక కోచింగ్ సెంటర్‌ను, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇంకో కేంద్రాన్ని ప్రారంభించారు. అధునాతన లైబ్రరీలను కూడా అందుబాటులో ఉంచి కోచింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు.
కల సాకారం కావాలంటే..
కొలువుల కలసాకారం కావాలంటే అభ్యర్థులు ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అనుకున్న లక్ష్యం కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే తప్పకుండా విజయం దరిచేరుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ రాదని, విలువైన ఈ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు.
మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
పోలీసు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు పోస్టుల దరఖాస్తుకు మే 20 వరకు, గ్రూప్ 1 పోస్టులకు మే 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కష్టపడి చదివితే కొలువు సులువే..
కష్టపడి చదివితే కొలువు సాధించడం సులువేనంటున్నారు నిపుణులు. అనవసర భయాలు పెంచుకోవద్దు. ఒత్తిడికి లోనుకావొద్దు. భయం, ఆత్రుత అనేవి మొదలైతే అది అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీస్తాయి. వీటిని జయించాలంటే అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. దాని ప్రకారం చదవాలి. అప్పుడప్పుడూ రిలాక్స్ కావాలి. రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. కొద్దిగా శారీరక శ్రమ అవసరం. అప్పుడే ఒత్తిడి దూరమవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. గంటలకొద్దీ చదవకుండా మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవాలి. దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
గ్రంథాలయంలో ప్రిపేర్ అవుతున్నాను..
జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. టెట్, పోలీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. ఈసారి జోనల్ వ్యవస్థ వల్ల ఎక్కువమందికి జాబ్స్ వచ్చే అవకాశాలున్నాయి. గ్రంథాలయంలో లేటెస్టు నాలెడ్జ్ బుక్స్ ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అన్ని పేపర్లలో సబ్జెక్ట్ మెటీరియల్స్ బాగా ఉన్నాయి. టీశాట్‌లో కూడా క్లాసులు బాగా చెబుతున్నారు.
–బానోత్ రవి, చిట్టి రామవరం, కొత్తగూడెం
గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నా..
గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నా. ఈసారి పక్కాగా జాబ్ సాధిస్తా. పట్టుదలతో చదువుతున్నా. గతంలో చదివిన అనుభవం ఉంది. అందుకే నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. నేను చాలా కాలంగా గ్రంథాలయంలోనే బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఏ సంవత్సరం పేపర్లు కావాలన్నా అందుబాటులో ఉన్నాయి. నమస్తే తెలంగాణ పేపర్లో నిపుణ చాలా ఉపయోగపడుతోంది.
–చిర్రా రవి, గానుగపాడు, చండ్రుగొండ
ఇంతకన్నా అదృష్టం ఏముంది..
జోనల్ వ్యవస్థ వల్ల చాలా ఎక్కువ మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి. ఎవరి జిల్లా పోస్టులు వారికే ఉంటాయి. వయోపరిమితిలో కూడా సడలింపులు ఇచ్చారు. ఇది చాలా మంచి అవకాశం. ముఖ్యంగా కోచింగ్ ఇవ్వడం గొప్ప విషయం. కష్టపడి చదివితే కొలువు సాధించడం కష్టమేమీ కాదు. ఇంతకుమునుపు ఉన్న ప్రభుత్వాలు ఇలాంటివేమీ చేయలేదు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది?
–ఎం.ప్రవీణ్, కేసుపల్లి, ఏన్కూరు
గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నా..
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. గతంలో ప్రభుత్వాలు ఇన్ని నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు మాలాంటి వారికి అండగా నిలుస్తున్నది. గతంలో కోచింగ్‌కు వెళ్లాలంటే రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అంబేద్కర్ భవన్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. నిపుణుల ద్వారా కోచింగ్ తీసుకుంటున్నా. గ్రూప్స్ కోసం సిద్ధమవుతున్నా. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో చదువుతున్నా.
–దీపికా మాధురి, దమ్మపేట మండలం