భద్రాచలం, ఏప్రిల్ 29: వేసవిలో ఏజెన్సీలోని ఆదివాసీలకు నీటి ఎద్దడి సమస్యను రానీయొద్దని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టియానా జోంగ్త్ సూచించారు. మిషన్ భగీరథ నల్లాలు సక్రమంగా పనిచేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీడీఏ పీవోలతో హైదరాబాద్ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో మంచినీటి సమస్యను నివారించేందుకు బోర్లు, కరెంట్ మోటార్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూరుమూల మండలాల్లో మంచినీటి బోర్లు ఉన్నాయని, ఇంకా అదనంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించే బోర్లకు మంచినీళ్లు సక్రమంగా వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌తో భద్రాచలం ఐటీడీఏ పీవో మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. ఎస్వో సురేశ్‌బాబు, యూనిట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.