భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. కొత్తగూడెం కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం పలికారు. 76 జీవోలో 2014 తర్వాత కొత్తగూడెం పట్టణంలో కొత్తగా కట్టుకున్న ఇళ్లను రెగ్యులర్ చేసే అవకాశం కల్పించాలని, పట్టణానికి రూ.120 కోట్లతో మంచినీటి సరఫరా మంజూరు చేయాలని కోరారు. కొత్తగూడెం మొర్రేడువాగుకు రూ.130 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని, పాల్వంచ వేంకటేశ్వరస్వామి టెంపుల్ శ్రీనివాసగిరిగుట్టపైకి సీసీ రోడ్డు నిర్మాణానికి ఫారెస్టు అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
పాత పాల్వంచ చింతలచెరువుకు రూ.10 కోట్లతో ట్యాంక్‌బండ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. పాల్వంచలో రూ.కోటితో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు నిధులు మంజూరు చేయాలని, పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు నిధులు కేటాయించాలని, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల అభివృద్ధికి రూ.28 కోట్ల నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. రుద్రంపూర్ ఎస్ఆర్టీ కాలనీ, వనమా నగర్, మాయాబజార్ కాలనీల ప్రజల కోసం 15 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.