ఖమ్మం సిటీ, ఏప్రిల్ 29 : ‘తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవి’. ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి. పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ ప్రసవం తర్వాత అనేక మంది తల్లులకు పాలు పడడం లేదు. గర్భిణులుగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం ఒక కారణమైతే.. మరికొందరిలో జీవన వ్యవహారం, మానసిక స్థితి మరో కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఇంకొందరు మహిళలు బిడ్డకు పాలు పట్టించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ డబ్బా పాలు తాగిస్తుంటారు. దీంతో బిడ్డలు శారీరక రుగ్మతలతో పుట్టడం, బలహీనంగా పెరగడం సర్వసాధారణంగా జరుగుతున్నది. ఆ పరిస్థితులన్నింటినీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కాగా, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. దవాఖానలో ప్రసవించిన మహిళల నుంచి, బయటి బాలింతల నుంచి తల్లిపాలను సేకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మూడో స్థానంలో ఖమ్మం..
ఖమ్మం పెద్దాసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయి. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు ప్రసవం జరిగిన వెంటనే పాలు పడడం లేదు. వారంలోపు పసివాళ్లకు తల్లిపాలే తాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘మదర్ మిల్క్ బ్యాంక్’లు ఎంతగానో సహకరిస్తాయి. పెద్దాసుపత్రిలో కాన్పులు చేయించుకుంటున్న తల్లులు, బయటి వారి నుంచి పాలను సేకరిస్తారు. అత్యాధునిక ఫ్రీజర్‌లో వాటిని భద్రపరిచి మొదట బలహీనంగా పుట్టిన బిడ్డలకు అందజేస్తారు.
అదేక్రమంలో ఎవరైతే పాలు పడని తల్లులుంటారో వారి బిడ్డలకు కూడా స్వచ్ఛతకు మారు పేరైన తల్లిపాలను పట్టిస్తారు. కాగా తల్లుల నుంచి సేకరించిన పాలను దాదాపు 40 రోజుల నుంచి ఆరు నెలల వరకు భద్రపరుస్తారని దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి. ఈ తరహా విధానం హైదరాబాద్ నీలోఫర్ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశారు. ఇటీవలే వరంగల్లోనూ ప్రారంభించారు. తాజాగా మంత్రి పువ్వాడ చొరవతో ఖమ్మంలోనూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వస్తున్నది. కాగా పసి బిడ్డలకు పాలు పట్టించే కేంద్రంగా ఖమ్మం రాష్ట్రంలోనే మూడవస్థానంలో నిలువడం గమనార్హం.
అందుబాటులోకి ఆధునిక మార్చురీ..
మనిషి చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని భద్రపరచడం, ఏవైనా పోలీసు కేసులు నమోదైతే పోస్టుమార్టం కోసం ఖమ్మం పెద్దాసుపత్రిలో అత్యాధునిక మార్చురీ గదిని నిర్మించారు. ప్రస్తుత గది అసౌకర్యంగా ఉన్నందున వైద్యాధికారులు విషయాన్ని మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లగా సానుకూల్పంగా స్పందించి నిధులు మంజూరు చేయించారు. దీంతోపాటు ఆసుపత్రి ప్రాంగణంలోనే రేడియాలజీ భవనాన్ని నిర్మించేందుకు ఆయన ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. దీంతో అల్ట్రాసౌండ్, సిటీస్కాన్, ఎంఆర్ఐ, మెమోగ్రామ్, ఎక్స్‌రే విభాగాల సేవలన్నీ రోగులకు ఒకేచోట లభించనున్నాయి.
మదర్ మిల్క్ బ్యాంక్, మార్చురీ గదిని శనివారం మంత్రి పువ్వాడ ప్రారంభించనున్నారు. రేడియాలజీ భవనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కాగా.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం మంత్రి హాజరవుతున్నందున శుక్రవారం పెద్దాసుపత్రిని కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించారు. మదర్‌మిల్క్ బ్యాంక్, మార్చురీగదితోపాటు రేడియాలజీ భవన భూమిపూజ ప్రాంతాలను పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.