ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీస్‌శాఖ భారీగా జరిమానా విధించింది. అయితే, కొంతకాలంగా వాహనదారులు జరిమానాలు చెల్లించకపోవడంతో పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో జరిమానాలో 25శాతం చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు వాహనదారులకు అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది వాహనదారులు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా 15,61,557 కేసులు నమోదు కాగా.. వాహనదారులు రూ.43,32,00,170 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. వాహనదారులు 9,71,982 ఈ చలాన్లకు రూ.14,95,49,343 కోట్లు చెల్లించారు. ఇంకా 5,89,575 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎలాంటి రాయితీ లేకుండా రూ.17.52 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
ఖమ్మం, ఏప్రిల్28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ చలాన్ల చెల్లింపునకు పోలీసుశాఖ కల్పించిన రాయితీకి మంచి స్పందన వచ్చింది. అన్ని రకాల వాహనాలకు సంబంధించి గతంలో విధించిన చలాన్లో 75శాతం రాయితీ కల్పించి 25 శాతమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. దీంతో వాహనదారులు చలాన్లు కట్టేందుకు ఆసక్తి చూపారు. ప్రజాభద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాహనదారులు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో వాహనదారులను దారిలోకి తెచ్చేందుకు పోలీస్‌శాఖ భారీగా జరిమానాలు విధించింది.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో 2018 నుంచి 2022 ఏప్రిల్ 15 వరకు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వీటిని చెల్లించేందుకు ప్రజలు అంత ఆసక్తి చూపలేదు. ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేక జరిమానాలు కట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదై, జరిమానాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. పరిస్థితిని గమనించిన పోలీస్‌శాఖ ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఇతర కేసుల్లో చెల్లించే జరిమానాలో రాయితీ కల్పించింది. ఈ చలాన్స్‌లో 25శాతం చెల్లిస్తే సరిపోతుందని పోలీస్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాహనదారులకు అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది వాహనదారులు ప్రభుత్వం కల్పించిన రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
జిల్లాలో ఉల్లంఘన కేసులు ఇలా..
జిల్లావ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసులు నమోదు చేసి ఈ చలాన్స్ జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహనాలు 13,90,432, త్రిచక్ర వాహనాలు 57,157, నాలుగు చక్రాల వాహనాలు 82,443, లారీలు1,026, ట్రక్లు 2,247 వరకు ఉన్నాయి. మొత్తంగా 15,61,557 కేసులు నమోదు చేశారు. వాహనదారులు రూ.43.32కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం కల్పించిన రాయితీకి జిల్లావ్యాప్తంగా మంచి స్పందన లభించింది. వాహనదారులు 9,71,982 ఈ చలాన్లకు సుమారు 15 కోట్లు చెల్లించారు. ఇంకా 5,89,575 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎలాంటి రాయితీ లేకుండా 17.52కోట్లు చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
వాహనాలపై భారీగా చలాన్లు ఉండడంతో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో వాహనదారులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఫొటోలు తీసి జరిమానాలు వేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి. ట్రాఫిక్‌లోకి వెళ్లాలంటేనే భయపడే విధంగా ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారన్న ఆరోపణలు చేసిన ప్రజలు నేడు ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.