లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 28: చెట్టు ఒక్కటి.. ప్రయోజనాలు బహుళం. ఈ చెట్టు గురించి కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక్కసారి దీనిని నాటితే దాని ప్రయోజనాలు అనంతంగా ఉంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఈ చెట్ల పెంపకం వల్ల అడవి విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా పెరిగే చెట్టు ఇది. అదే.. పూసుగు చెట్టు. దీంతో అటవీ శాఖ కూడా ఈ చెట్టు పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వేసవి కాలంలో ఎంతటి దట్టమైన అడలోనైనా చాలా చెట్లు ఆకురాలి కళావిహీనంగా కన్పిస్తాయి. అయితే ఈ చెట్టు మాత్రం వేసవిలో కూడా పచ్చటి ఆకులతో దర్శనమిస్తుంది.
అడవిలో అనువైన చెట్టు..
ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన ఆకర్షణ కోల్పోకుండా పచ్చగా ఏపుగా పెరగడం ఈ చెట్టు లక్షణం. సుమారు 30 మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్లు తెలంగాణతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాల్లో ఉంటాయి. ఈ చెట్టుకు దట్టమైన ఆకులు ఉండడంతో సూర్య కిరణాలు దాని కింద భూమిని తాకవు. దీంతో చెట్టు కింద చుట్టూ నీడ ఉంటుంది. అలాగే గాలి దుమ్ములను కూడా ఈ చెట్టు తట్టుకుంటుంది. అడవి జంతువులు, పక్షులకు వేసవిలో నీడనిస్తుంది. చెట్టు కింద ఇవి సేదదీరేందుకు అవకాశముంటుంది.
రుచికరమైన పండ్లనిస్తూ..
రుచికరమైన పండ్లనివ్వడం ఈ చెట్టుకున్న మరో లక్షణం. జూన్ మొదటి వారంలో పండ్లు కోతకు వస్తాయి. ఈ పండ్లను ఏజెన్సీలోని ఆదివాసీలు ద్రాక్ష పండ్లలా భావిస్తుంటారు. ప్రతి చెట్టు కూడా ఒక టన్ను దిగుబడి ఇస్తుంది. సహజ సిద్ధంగా లభించే ఈ పండ్లను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విరివిగా ఆరగిస్తారు.
ఔషధ గుణాల కలయిక..
ఈ చెట్టుకు అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు పండ్లలో విటమిన్ -సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా ఉండే జీర్ణాశయ సమస్యలు నయమవుతాయి. ఈ చెట్టు బెరడును.. కాలిన గాయాలు, కుష్టు, చర్మవాపుల నివారణకు, మలేరియా నివారణ మందుల తయారీకి వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చెట్టు గింజల నుంచి వచ్చిన నూనెను చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. విదేశాల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది.
ప్రత్యేక దృష్టి సారిస్తాం..
పూసుగు చెట్ల పెంపకంపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈ చెట్లను అటవీ ప్రాంతాల్లో పెంచడం వల్ల వేసవిలో కూడా అడవి పచ్చగా ఉంటుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పూసుగు చెట్లు విరివిగా ఉన్నాయి. ఇవి మంచి నీడను ఇస్తాయి. దీంతోపాటు ఔషధ లక్షణాలు కూడా ఉండడంతో ఈ చెట్టు బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది. వివిధ నర్సరీల్లో ఈ చెట్లను పెంచేందుకు మొక్కలను కూడా సిద్ధం చేస్తున్నాం. అడవుల్లో పూసుగు చెట్ల నుంచి విత్తనాలు సేకరించి మరిన్ని మొక్కలను పెంచడం ద్వారా వీటిని విస్తృతంగా నాటేందుకు చర్యలు చేపట్టాం. పూసుగు చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఆరోగ్యానికి సంజీవనిలా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు పండ్లలోని సి-విటమన్ ఆరోగ్యానికి మంచిది.
– అప్పయ్య, ఎఫ్డీవో, కొత్తగూడెం