ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 28: ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఉద్యోగోన్నతుల కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్ ప్రమోషన్‌కు ఎస్జీటీలు, పీఈటీలు, పండిట్లు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నూతన ఉద్యోగాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు ఇప్పటికే పలు శాఖలో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల అవకాశం కల్పిస్తోంది. ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా అధికారులు ఆ ప్రక్రియను వేగవంతం చేశారు. వివిధ శాఖలో సీనియార్టీ ప్రాతిపదికన జాబితాలను తయారుచేసి ఉన్నతాధికారులకు అందజేశారు. బదిలీలు, ప్రమోషన్లను వేసవి సెలవుల్లోనే పూర్తి చేసి స్కూళ్ల ప్రారంభం నాటికి రిలీవ్ అయ్యి కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నూతన జిల్లాల ఆధారంగా..
317 జీవో ప్రకారం బదిలీల అనంతరం నూతన జిల్లాల వారీగా బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన ప్రక్రియను అందుకు అవసరమైన వివరాలను సేకరించారు. ప్రమోషన్ల ఖాళీలకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని కేడర్ల వారీగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల వద్ద నుంచి డీఈవో యాదయ్య తీసుకున్నారు. సీనియార్టీ జాబితాను రూపొందించారు. దీంతో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు మార్గం సుగమమైనట్లయింది. ఉద్యోగోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా సబ్జెక్టుల వారీగా జీవశాస్త్రం, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, పీఈటీ నుంచి పీడీగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు.
హోదా.. హైక్..
ఉద్యోగి జీవితంలో పదోన్నతి పొందడం సంతోషాన్ని కలిగిస్తుంది. హోదా పెరగడంతోపాటు ఇంక్రిమెంట్ (హైక్) వస్తుంది. ఉద్యోగుల సర్వీస్ ఆధారంగా సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రమోషన్లు లభిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రమోషన్లను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూనే ఉంది. గడిచిన ప్రభుత్వాల మాదిరిగా పైరవీలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రమోషన్లకు సబంధించిన ఖాళీలు ఏర్పడగానే సీనియార్టీ ఆధారంగా ఉద్యోగోన్నతులు కల్పిస్తోంది. తాజాగా ప్రమోషన్లు పొందేందుకు కనీస సర్వీస్‌ను సైతం తగ్గించింది. దీంతో ఉద్యోగులు త్వరత్వరగా ఉద్యోగోన్నతులు పొందే అవకాశం ఏర్పడింది.