సత్తుపల్లి, ఏప్రిల్ 29: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటికుంటలు (ఫాం పాండ్స్) ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట పొలాల్లో వర్షం నీటిని నిల్వ చేసుకునేందుకు నీటికుంటలు నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నీటికుంటలు తవ్వుకునేలా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. పథకంలో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో ఉచితంగా కుంటలు తవ్విస్తున్నారు.
పుష్కలంగా నీరు..
వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకునే విధంగా పంట పొలాల వద్ద నిర్మించుకున్న కుంటలు (ఫాం పాండ్స్). బోరు బావులు, వర్షాధారం ఆధారంగా రైతులు పంటలు పండిస్తారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు నీటి కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో బోరుబావుల్లో నీరు పుష్పలంగా ఉంటుంది. భారీ వర్షాలకు భూమి కోతకు గురికాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మట్టి వర్షపునీటితో పాటు గుంతలో చేరుతుంది. ఈ మట్టి ఎరువులా పొలాలకు ఉపయోగపడుతుంది. నీటి కుంటలతో వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు పండించుకోవచ్చు.
రైతులకు అవగాహన..
గతేడాది మండలానికి 20 నీటికుంటలు మంజూరుకాగా అన్ని కుంటల తవ్వకం పూర్తయింది. ఈ ఏడాదిలో ఇప్పటికే 10 నీటి కుంటలు అందుబాటులోకి వచ్చాయి. పైసా ఖర్చు లేకపోవడంతో రైతులు నీటి కుంటల తవ్వకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అధికారులు ఉపాధి కూలీలతో 20/20 చదరపు మీటర్లలో కుంటలు తవ్విస్తున్నారు. కిష్టారం అటవీప్రాంతంలో వీటి తవ్వకాలు ఎక్కువగా ఉన్నాయి. కుంటల తవ్వకంపై ఆసక్తి ఉన్న రైతులు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
రైతులు పంట పొలాల్లో నీటికుంటలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. వీటి ఏర్పాటుతో భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయి. ఫాం పాండ్స్ తవ్వకాల ఖర్చు పూర్తిగా ఉచితం. ఒక్కో కుంటకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున వెచ్చిస్తున్నది. ఉపాధి పథకం కింద కుంటలు తవ్విస్తున్నది.
– బాబూరావు, ఏపీవో, సత్తుపల్లి