
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 16 : ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్నతనంలో చదువుకు దూరమైనవారికి, మధ్యలోనే బడిమానేసిన వారికి పదో తరగతి, ఇంటర్ అభ్యసించేందుకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సువర్ణావకాశం కల్పిస్తోంది. నియత విద్యకు దూరమైనవారు, ఉపాధి కోసం ఏదో వృత్తిలో ఉన్నవారు కూడా విద్యను అభ్యసించడానికి ఓపెన్ స్కూల్ విద్యను ప్రవేశపెట్టారు. జిల్లాలో ఏటా వేలాది మంది అభ్యాసకులకు టెన్త్, ఇంటర్ చదువుకునే అవకాశం కల్పిస్తూ వారి జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తోంది.
రెండు జిల్లాల్లోనూ అధ్యయన కేంద్రాలు..
విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైనవారికి ఓపెన్ స్కూల్ విద్య వరంగా మారింది. పదేళ్లుగా అమలు చేస్తున్న ఈ విధానంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానంలో చదువుకునేందుకు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. చదవడం, రాయడం తెలిసి 14 ఏళ్లు నిండిన వారందరికీ దూరవిద్య విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పదో తరగతికి 30 అధ్యయన కేంద్రాలు, ఇంటర్‌కు 29 అధ్యయన కేంద్రాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదోతరగతికి 26 అధ్యయన కేంద్రాలు, ఇంటర్‌కు 28 అధ్యయన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు..
ఓపెన్ స్కూల్ విద్యలో పదోతరగతిలో ప్రవేశం పొందేందుకు 31 ఆగస్టు 2021 నాటికి 14ఏళ్లు, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు 15 ఏళ్లు నిండి ఉండాలి. ప్రవేశాలకు గరిష్ఠ పరిమితి లేదు. ఇంటర్లో చేరేందుకు పది ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుతోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యాసకులు ఆయా కేటగిరిలకు సంబంధించిన పత్రాలను జత చేయాలి. ఈ ధ్రువపత్రాలు రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన వారికి ఇచ్చే వాటితో సమానం. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకూ అర్హత కల్పిస్తోంది. 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. WWW. TELANGANAOPENSCHOOL .ORG వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజులు…
పదోతరగతి జనరల్ కేటగిరికి సంబంధించి పురుషుల ప్రవేశ రుసుం రూ.1000కి దరఖాస్తు రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1100 చెల్లించాలి. అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల కేటగిరిల పురుషులకు రూ.600కు కలిపి మొత్తం రూ.700 చెల్లించాలి. ఇంటర్ జనరల్ కేటగిరికి చెందినవారైతే పురుషులు రూ.1100, రూ.200 దరఖాస్తు రుసుం కలిపి మొత్తం రూ.1,300 చెల్లించాలి. ఇతర కేటగిరిలకు చెందినవారైతే రూ.800, దరఖాస్తు రుసుం కలిపి మొత్తం రూ.1000 చెల్లించాలి. ఫీజులను అభ్యాసకులు ఆన్లైన్లో చెల్లించాలి. ప్రవేశాలను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు, అపరాధ రుసంతో సెప్టెంబర్ 11 నుంచి 23వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఓపెన్ విద్యకు సంబంధించి సందేహాలు ఉంటే ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అవధానుల మురళీకృష్ణ సెల్ నెం 8008403522ను సంప్రదించాలని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. డీఈవో సిగసారపు యాదయ్య మాట్లాడుతూ రెగ్యులర్ విద్యతో సమానంగా ఓపెన్ స్కూల్ విద్యకు గుర్తింపు ఉందన్నారు. రెండు జిల్లాల కో ఆర్డినేటర్ అవధానుల మురళీకృష్ణ మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు అని పేర్కొన్నారు.