కూసుమంచి,ఏప్రిల్ 28: ఈ సంవత్సరం మిర్చి రేటు ఎక్కువగా ఉన్నందున వచ్చే సంవత్సరం రైతులు మిర్చి తోటలు ఎక్కువగా వేసే అవకాశాలున్నాయని వారి వివరాలు సేకరించి వారికి సంబంధించిన భూసార పరీక్షలు చేయాలని ఏడీఏ విజయ్ చంద్ర అన్నారు. కూసుమంచిలోని రైతు వేదికలో డిజిటల్ గ్రీన్ ఇండియా ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతులు, సీఆర్పీల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు మేలు జరిగే విధంగా అధిక దిగుబడి, మార్కెటింగ్ లో మెళకువలు వంటి విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అనుసంధానకర్తలుగా సీఆర్పీలను నియమించారని, గ్రామాల్లో సీఆర్పీలు ఒక్కొక్కరు 50 మంది రైతులను గుర్తించి వారికి పూర్తి సహకారాన్ని అందివ్వాలన్నారు. సంస్థ సభ్యులు యశోద, శ్రీకాంత్ మాట్లాడుతూ వచ్చే నెల నాలుగో తేదీ లోపు రైతుల వివరాలు పూర్తిగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో కూసుమంచి, తిరుమలాయపాలెం వ్యవసాయశాఖ అధికారులు వాణి, సీతారాంరెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.