ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 28: ఇంజినీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన సావిష్కార్ -2022 జాతీయ సింపోజియంలో వారు ముఖ్యఅతిథులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థులు తమలోని లోపాలను సరిదిద్దుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, సాంకేతికంగా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉత్తమ పరిజ్ఞాన వేత్తగా ఎదగాలని సూచించారు.
విద్యతోపాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లోనూ సత్తా చాటాలన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది కొలువులు ఉన్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ.. 19 ఏళ్ల కళాశాల చరిత్రలో 202 ఎంఎన్సీ కంపెనీల్లో వేలాదిమంది తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండడం కళాశాల ఖ్యాతిని చాటుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించేందుకు విద్యార్థులు పట్టుదలతో చదవాలన్నారు. శ్రమిస్తే విజయం సాధ్యమేనని స్పష్టం చేశారు. కాగా, జాతీయ స్థాయి ఫెస్ట్‌లో వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, డ్రాయింగ్, యంగ్ మేనేజర్ అవార్డు వంటి సాంకేతిక అంశాలను పోటాపోటీగా నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
విద్యార్థులు తొలుత తాము రూపొందించిన నమూనా ఆవిష్కరణలను ప్రదర్శించారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా, సమస్యలకు పరిష్కారం చూపేలా తమలోని ఆలోచనలకు రూపమిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్లు శివప్రసాద్, సుభాశ్‌చందర్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.