ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పట్టణాలు, నగరాలు గులాబీ తోరణాలతో నిండిపోయాయి. ఊరూవాడా ఏకమై ‘జై తెలంగాణ.. జై కేసీఆర్..’ అని నినదించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు పార్టీ జెండా గద్దెలను అందంగా ముస్తాబు చేసి పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను సన్మానించారు. కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి వేడుక చేసుకున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీకి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఖమ్మం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు గ్రామ, మండల, పట్టణ, నగర జిల్లా స్థాయిల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను పార్టీ నాయకులు సన్మానించారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీకి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పార్టీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతోపాటు ఇతర మండల, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకులు గుండ్లపల్లి శేషగిరిరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. సత్తుపల్లిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, పాల్వంచ పట్టణంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లలో ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ ప్రత్యేకతలను వివరించారు. వైరాలో పార్టీ సీనియర్ నాయకుడు కట్టా కృష్ణార్జున్‌రావు, భద్రాచలంలో తెలంగాణ ఉద్యమకారులు తిప్పన సిద్దులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మణుగూరు ప్రభుత్వాసుపత్రిలో నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.