ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్27 : పదోతరగతి పరీక్షలు దగ్గర పడుతుండడంతో అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఉన్నతాధికారుల నుంచి కేంద్రాలకు అనుమతి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 104 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.
కొవిడ్ నిబంధనల ప్రకారం..
మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పది పరీక్షలు జరుగనున్నాయి. కొవిడ్ నిబంధనలు పరిగణలోకి తీసుకుని కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా బాలికల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో పది పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని జంబ్లింగ్ పద్ధతిలో కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. పరీక్షలు జరిగే సమయం, నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండడంతోపాటు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా కేంద్రాలను ఎంపిక చేశారు.17,537 మంది విద్యార్థులకు 104 కేంద్రాలను కేటాయించారు.
విధులు కేటాయింపులు..
పరీక్షల నిర్వహణలో కీలకమైన సీఎస్, డీవోలు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు, రూట్ అధికారులు ఇలా అందరికీ విధులు కేటాయించి సమావేశాలు నిర్వహించారు. ఇందులో చాలామంది తమ విధులను క్యాన్సిల్ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. డీఈవో సిగసారపు యాదయ్య మాత్రం మొదట ప్రాధాన్యం పరీక్షల నిర్వహణకు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే విధుల నుంచి మినహాయింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
నేడు విద్యాశాఖ మంత్రి సమీక్ష..
పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ దేవసేన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధించిన వివరాలతో సమీక్షకు హాజరుకావాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఈవో సిగసారపు యాదయ్య, పరీక్షల విభాగ అధికారులు పాల్గొననున్నారు.