కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 27: యువ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తున్నది. వారు పరిశ్రమలను నెలకొల్పి మరికొంత మందికి ఉపాధి కల్పించేలా చొరవ తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సులభంగా అనుమతులు పొందేలా చర్యలు చేపట్టింది. ధ్రువీకరణ పత్రాలన్నీ సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే అనుమతి వచ్చేలా ‘టీఎస్-ఐపాస్’ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పారిశ్రామిక వేత్తలకు దళారుల నుంచి విముక్తి లభించింది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాదు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. భద్రాద్రి జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 2021-22లో మొత్తం 414 పరిశ్రమలకు అన్నిరకాల అనుమతులను పరిశ్రమలశాఖ మంజూరు చేసింది. గతేడాది యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 1,450మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
పరిశ్రమలను నెలకొల్పేందుకు ధ్రువీకరణ పత్రాలన్నీ సక్రమంగా ఉంటే నెల రోజుల్లోనే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ‘టీఎస్-ఐపాస్’ను తీసుకొచ్చింది. అనుమతుల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సులభతర వాణిజ్య విధానానికి తెరలేపింది. దీంతో అనేకమంది యువ పారిశ్రామికవేత్తలు, స్వశక్తితో పైకెదగాలనే ఆలోచన కలిగిన యువతకు రాష్ట్ర సర్కార్ అండగా నిలుస్తున్నది. గత ఏడేళ్లలో రాష్ట్రంలో అనేక మంది యూనిట్లు నెలకొల్పి ఆర్థికంగా ఎదగడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.
414 పరిశ్రమలకు అనుమతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం 2021-22లో మొత్తం 414 పరిశ్రమలకు అన్నిరకాల అనుమతులను పరిశ్రమలశాఖ మంజూరు చేసింది. పారిశ్రామికవేత్తలుగా రాణించాలనే ఉత్సాహం ఉన్నవారికి సకాలంలో రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. గతేడాది జిల్లాలో ఎగ్ట్రేల తయా రీ, పేపర్ ప్లేట్స్, అట్టల తయారీ, టైలరింగ్ ఇన్స్టిట్యూట్, రైస్ మిల్లు, ఎర్త్ మూవింగ్, ప్యాకింగ్ కంపెనీ, వాషింగ్ పౌడర్, సిమెంట్ బ్రిక్స్ తదితర పరిశ్రమలను నెలకొల్పేందుకు అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అర్హులందరికీ సకాలంలో రుణాలను అందించి పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తున్నది. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,030 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పగా 705మందికి ఉపాధి, ఉద్యోగ అకాశాలు లభించాయి.
టీ-ఐడీయా, టీ- ప్రైడ్ ద్వారా ఉపాధి
యువత కోసం పారిశ్రామిక రంగంలో సైతం రిజర్వేషన్ల ప్రాతిపదికన వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ ఇన్సెంటివ్ స్కీం(టీ-ఐడి యా), తెలంగాణ స్టేట్ ప్రో గ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంట్రప్రెన్యూర్ ఇన్సెంటివ్ స్కీం(టీ-ప్రైడ్) లాంటి పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల్లో షెడ్యుల్డ్ కు లం, షెడ్యుల్డ్ తెగల వారికి పారిశ్రామిక ప్రోత్సాహక రాయితీలను అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం ఉన్నవారిని వెన్నుతట్టి ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీ-ప్రైడ్, టీ-ఐడీయా పథకాల ద్వారా పరిశ్రమలు, వాహనాలు, సేవారంగంలో రూ.310 యూనిట్లకు రూ.15.15 కోట్ల సబ్సిడీని ఇవ్వగా మొత్తం 550మందికి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎంఈజీపీ) ద్వారా 28 యూనిట్లను మంజూరు చేయగా రూ.1.09 కోట్లతో 170మంది ఉపాధి పొందినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.