ఖమ్మం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవమానాలు, అవహేళనలు.. గుప్పెడు మందితో మొదలైన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.. వలసవాదులు, సమైక్యవాదులకు అడ్డాగా ఉన్న ఖమ్మం గుమ్మంలో పోరుజెండా రెపరెపలాడింది. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించింది. సబ్బండ వర్గాలను ఏకం చేసింది. రాజకీయ పక్షాలు, విద్యార్థి, ఉద్యోగ, మేథావులు, న్యాయవాదులు, కుల, వృత్తిసంఘాలు ఏకమై కేసీఆర్ బాటలో నడిచాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, తెలంగాణ గడ్డకు అన్నిరంగాల్లో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పుట్టి అప్పుడే రెండు దశాబ్ధాలు దాటింది. ఆవిర్భావం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యమ తీరుతెన్నులు, టీఆర్ఎస్ ప్రస్తానంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
‘తెలంగాణ వచ్చుడా.. కేసీఆర్ చచ్చుడా’ అనే నినాదంతో ఉద్యమ పిడికిలి బిగిసింది. 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో గడగడలాడిన సీమాంధ్ర పాలకులు కేసీఆర్‌ను అదేరోజు అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇక్కడైతే వలసవాదులు, సమైక్యవాదులు ఎక్కువగా ఉన్నారు.. ఎలాంటి సమస్యా తలెత్తదని భావించారు. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కొచ్చని కలలుగన్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. మలిదశ ఉద్యమకర్తను అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొస్తున్నారన్న విషయం తెలియగానే శక్తులన్నీ ఏకమయ్యాయి. రాజకీయ పక్షాలు, విద్యార్థి, ఉద్యోగ, మేధా వులు, న్యాయవాదులు, కుల, వృత్తి సంఘాలు కేసీఆర్‌కు అండగా నిలిచాయి. పోలీసుల తో కొట్లాడారు. దెబ్బలు తిన్నారు. జిల్లా ఉద్యమబిడ్డల పోరాటానికి ముచ్చటపడిన కేసీఆర్ జిల్లా జైలు, ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే దీక్షను కొనసాగించారు. ఇదే పది జిల్లాల మలిదశ ఉద్యమానికి మరోమారు నాంది పలికింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, తెలంగాణ గడ్డకు అన్నిరంగాల్లో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పుట్టి అప్పుడే రెండు దశాబ్ధాలు దాటింది. ఉద్యమ పార్టీగా తెలంగాణ, ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రజలను ఉద్యమపథంలోకి పయనింపజేసి ఉద్యమంలో కార్యోన్ముఖులను చేసింది. దశాబ్దంన్నరపాటు ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన పునాదులను వేసింది. సకలజనుల సమ్మె వంటి చారిత్రక ఘట్టాలు ఖమ్మం చరిత్రలో నిలిచిపోయాయి. 2001 ఏప్రిల్ 27వ తేదీన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో జలదృశ్యంలో పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నేటికి 21సంవత్సరాలకు చేరుకున్నది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కనీవిని ఎరుగని పోరాటాలను చేసి చుక్కరక్తం చిందకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నది టీఆర్ఎస్.
తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో మొదటి నుంచి అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం తన ఉనికిని మాత్రమే చాటింది. తొలిరోజుల్లో గుప్పెడుమంది కార్యకర్తలు మాత్రమే టీఆర్ఎస్లో ఉన్నారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతంలో ఉద్యమకారుల బలం తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు జిల్లాలో స్థానంలో లేదు. 2001 నుంచి 2009 వరకు జిల్లాలో చెప్పుకోదగిన కేడర్ ఆ పార్టీకి లేని పరిస్థితి ఉంది. అప్పట్లో సింగరేణి కార్మికులు మినహా టీఆర్ఎస్ను ఆదరించిన వారు లేరనే విషయం అతిశయోక్తి కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా టీఆర్ఎస్ జిల్లాలోని 10 నియోజవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున జలగం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మిగిలిన నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకొని కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇతర పార్టీల నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో చేరారు. 2019 చివరి అంకంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకేఒక్క స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నా.. అనంతరం జరిగిన పరిణామాల్లో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఘననీయమైన మెజార్టీని సాధించి చరిత్ర సృష్టించారు. అనంతరం జరిగిన సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 శాతం సీట్లను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలో అతిపెద్ద పార్టీగా గులాబీ పార్టీ అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అడ్రస్ గల్లంతైంది.
గుబాళించిన ‘గులాబీ’ దండు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే పురుడు పోసుకున్న టీఆర్ఎస్, పురిటిగడ్డపై అలుపెరగని పోరాటం చేసింది. సమైక్యవాదుల అడ్డాగా ఉన్న ఉద్యమగుమ్మాన్న ఆ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది. సొంతంగా చెప్పుకోదగ్గ బలం లేకపోయినా ప్రజల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన రీతిలో కొట్లాడింది. రాష్ట్ర పొలిటికల్ జేఏసీ లేదా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం ఏ పిలుపునిచ్చినా వెనకడుగువేయలేదు. సకలజనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న సమయంలో జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను ఏపీకి బదులు టీజీగా మార్చి, సమైక్యవాదానికి స్థానం లేదని తేల్చిచెప్పారు.
అనేకమార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, రాజయ్య, సీనియర్ నాయకులు కేశవరావు తదితరులను జిల్లాకు రప్పించి తెలంగాణవాదానికి మద్దతు కూడగట్టారు. అడుగడునా సీమాంధ్ర నేతల విగ్రహాలున్న జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పారు. సీమాంధ్ర విష సంస్కృతి నిండిన ఉద్యమగుమ్మాన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితను రప్పించి తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా దుగ్గినేని భాస్కర్‌రావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, దిండిగల రాజేందర్ పనిచేశారు.
కేసీఆర్ దీక్షతో ఎగిసిన పోరుజెండా..
ఖమ్మం సీమాంధ్ర వలసవాదులకు అడ్డా. సమైక్యవాద పార్టీలకు నెలవు. ఎక్కడచూసినా తెలంగాణ వ్యతిరేక శక్తులే. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవర్గాలంతా సమైక్యవాదులే. ఈ కారణంగా తెలంగాణ కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టిన కేసీఆర్ 2009, నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య సర్కార్ కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మానికి తరలించి 36 గంటలపాటు ఉంచారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు ప్రభుత్వాసుపత్రికి చేర్పించారు. అక్కడా ఉద్యమకారులు పోరాటాన్ని ఆపలేదు. పోలీసులు లాఠీలతో కుళ్లబొడుస్తున్నా ఏమాత్రం లక్ష్యపెట్టకుండా జై తెలంగాణ అంటూ నినదించారు. చివరికి డిసెంబర్ 3న కేసీఆర్‌ను ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కాగా ఆనాడు ఖమ్మంలో జరిగిన ఉద్యమమే మరోమారు యావత్ తెలంగాణ సమాజంలో అగ్గిరాజేసింది.
మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర
పాలకుల కుట్రలు, రాజకీయ నాయకుల దిగజారుడుతనం వల్ల యావత్ తెలంగాణ వ్యాప్తంగా 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నీరుగారింది. కాదుకాదు నివురుగప్పిన నిప్పులా, మబ్బులమాటున దాగిన సూర్యుడిలా ఉండిపోయింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ చూపిన తొవ్వలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఇచ్చిన స్ఫూర్తితో, 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మలిదశ ఉద్యమకర్తను అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకురావడంతో ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మమత విద్యాసంస్థల చైర్మన్ హోదాలో సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటానికి మద్దతు పలికారు. వేలాదిమంది విద్యార్థులతో ఆందోళన నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించారు.