పాల్వంచ, ఏప్రిల్ 26: 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఆ తరువాత పాలించిన బీజేపీ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని తెలంగాణలో ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇన్నేళ్లలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. అలాంటి పార్టీలకు టీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని అన్నారు. ఇన్నేళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. ప్రజలకు ఏం చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు.
అలాంటి పార్టీ.. ప్రజల ముందుకొచ్చి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం అప్పట్లో కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి అవహేళన చేసిన రేవంత్‌రెడ్డి.. ఈ రోజు ప్రజల ముందుకొచ్చి టీఆర్ఎస్ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను చూసి జీర్ణించుకోలేక బీజేపీ.. టీఆర్ఎస్పై అవాకులు, చవాకులు పేలుతోందని విమర్శించారు. దేశంలో మొత్తం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీనీ కేటాయించకపోవడం బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని దుయ్యబట్టారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించేందుకే కొత్త ఉద్యోగాల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనకుండా కేంద్రం తప్పించుకుందని, రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందుతుండడాన్ని జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో విద్యుత్ చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్, రైతుబంధు పథకాలు లేవని, తమ రాష్ర్టాల్లో వాటిని అమలు చేయలేని బీజేపీ.. తెలంగాణపై కడుపుమంటతో ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. యాత్రల పేరుతో బీజేపీ నేత బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. దళితబంధు పథకం దేశంలోనే ఎస్సీల చరిత్రను తిరగరాసిందని అన్నారు. దళితులకు ఉచితంగా రూ.10 లక్షలు అందజేస్తూ వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు.
ఐదు స్థానాలూ టీఆర్ఎస్వే: పువ్వాడ
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి మేలు జరిగిందని అన్నారు. పవర్ ప్లాంట్ల నిర్మాణం, మెడికల్ కాలేజీ, అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉందని, రాబోయే ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో ఐదు స్థానాలు సాధించడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మంతపురి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వనమా ఇంటికి మంత్రులు
పాత పాల్వంచలో ఉన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహానికి రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు – పద్మావతి దంపతులు వారికి పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. సతీసమేతంగా వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు.