కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 26: మహిళలను మావోయిస్టులు చిత్రహింసలు పెడుతున్నారని భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా మంగళవారం కొత్తగూడెంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు, నాయకులు మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. బాలికలను పార్టీలో బలవంతంగా చేర్చుకుని వారితో వంట పనులు, సామగ్రి మోసే పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. పార్టీలోని మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, వారిని బలవంతపు వివాహాలు చేసుకుంటున్నారన్నారు. మావోయిస్టుల బెదిరింపులకు తలొగ్గి ఆ పార్టీలో చేరిన ఇద్దరు యువతులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి పోలీసులు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల సమక్షంలో లొంగిపోయినట్లు తెలిపారు.
చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన ముస్కి సుక్కి అలియాస్ విమల(18), అదే మండలంలోని చెన్నాపురానికి చెందిన మడకం ప్రమీల అలియాస్ పాలె(18) చర్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. విమల చర్ల మండలం ఎల్జీఎస్ సభ్యురాలిగా పనిచేస్తుండగా, ప్రమీల మణుగూరు ఎల్ఓఎస్ సభ్యురాలిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు వీరిద్దరిని 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే బలవంతంగా పార్టీలో చేర్చి వారితో వెట్టి చాకిరీ చేయించినట్లు తెలిపారు. సీనియర్ మావోయిస్టు నాయకుడు దామోదర్ ఆదివాసీ యువతి రజితను బలవంతపు వివాహం చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విమల, ప్రమీల ఇబ్బందులను తాళలేక జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకుని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు స్పష్టం చేశారు. విమల, ప్రమీలకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు, సీఆర్పీఎఫ్ 141బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్ పాల్గొన్నారు.