భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : నిన్న, మొన్నటి వరకు కూలీలుగా ఉన్నవారు ఇక యజమానులుగా మారనున్నారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకునే రోజులొస్తున్నాయి. దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లబ్ధిదారులకు మంజూ రైన యూని ట్లను రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలివిడత ఖమ్మం జిల్లాలో 500, భద్రాద్రి జిల్లాలో 52 యూనిట్లు లబ్ధిదా రులకు అందజేయనుండడంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దళితబంధు పథకంలో భాగంగా భద్రాద్రి జిల్లాకు 421 యూనిట్లు మంజూరయ్యాయి. తొలివిడతగా 52 యూనిట్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో మంగళవారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్ యూనిట్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ప్రకాశం స్టేడియానికి రావాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం ఆహ్వానం పంపారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
తొలి విడతగా 52 మందికి పంపిణీ
తొలి విడతగా 52 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. 2 టాటా ఏసీలు,1 ఆటో,4 బొలేరో వాహనాలు,16 గూడ్స్ వాహనాలు,12 ట్రాక్టర్లు ,17 మినీ డైరీలు (పాడి గేదెలు)లను ఎంపిక చేశారు. మిగతా వారికి మరో వారం రోజుల్లో యూనిట్లను ఇవ్వనున్నారు. అందరూ ఒకే యూనిట్లను ఎంపిక చేసుకోవడం వల్ల వ్యాపారం సరిగా సాగదని, ఇతర యూనిట్లను ఎంపిక చేసుకోవాలని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.. జిల్లాలో ఐదు నియోజకవర్గాలున్నాయి. కొత్తగూడెంలో 100, భద్రాచలం 60, అశ్వారావుపేట 100, పినపాక 100, ఇల్లెందులో 44 మందిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 361 మందిని ఎంపిక చేశా.
దళితులకు ఆర్థిక భరోసా
ఇప్పటివరకు కూలి పనులు చేసుకుని కాలం వెల్లదీసుకుంటున్న దళిత కుటుంబాల్లో ఈ పథకం భరోసా కల్పించనున్నది. చదువుకున్నా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు చేయూతనందించనున్నది. జిల్లా వ్యాప్తంగా 39,000వేల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆర్థికంగా బలోపేతానికి దోహదం
దళితబంధు పథకం ఎస్సీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనున్నది. జిల్లాలో తొలి విడతగా 52 మందికి యూనిట్లను పంపిణీ చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకుంటే లబ్ధిదారులు లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గానికి ప్రత్యేకాధికారిని నియమించారు.
నేడు దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ :
మామిళ్లగూడెం, ఏప్రిల్ 25: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన చింతకాని మండలంతో పాటు ప్రతి నియోజక వర్గంలో 100 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మంగళవారం మంత్రు లు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు యునిట్లును లాంఛనంగా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు ఆసక్తి చూపిన యూనిట్లపై వారి కి శిక్షణ, చైతన్యం కల్పించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు దళితబంధు లబ్ధిదారులతో మంత్రులు ముఖాముఖి మాట్లాడి యూనిట్లను పంపిణీ చేయనున్నారు.
నేడు మంత్రుల పర్యటన ఇలా..
మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3:00 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటలకు ఎస్‌ఆర్‌ఎండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో దళితబంధు లబ్ధ్దిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.