ఖమ్మం ఎడ్యుకేషన్/మామిళ్లగూడెం, ఏప్రిల్ 25: మే 6వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల తరలింపునకు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు రవాణా సౌకర్యం, విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 59 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3 ప్లయింగ్ స్కాడ్స్, 8 మంది సిట్టింగ్ స్కాడ్స్ పర్యవేక్షణ చేస్తారని డీఐఈవో రవిబాబు పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఐసొలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, స్నేహలత, డీఆర్వో శిరీష తదితరులు పాల్గొన్నారు.