రఘునాథపాలెం, ఏప్రిల్ 25: ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో బీజేపీ అలజడులు సృష్టిస్తూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నదని టీఆర్ఎస్ నగర బీసీ కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంత్రి అజయ్‌కుమార్‌పై బీజేపీ నేతలు చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ మేరకు సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా బీసీ సంఘం నాయకులు వద్దిరాజు రవిచంద్ర, ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, దొరేపల్లి శ్వేత, బుడిగెం శ్రీనివాస్, రుద్రగాని శ్రీదేవి, గజ్జెల లక్ష్మి, తోట గోవిందమ్మ, గోళ్ల చంద్రకళ, ముక్కాల కమల, తోట ఉమారాణి, రాపర్తి శరత్, పగడాల నాగరాజు, నర్రా ఎల్లయ్య, మేకల సుగుణారావు, శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, షకీనా, తోట వీరభద్రం మాట్లాడారు.
అభ్యుదయ భావాలు కలిగిన ఖమ్మంలో మతోన్మాద పార్టీలకు స్థానం లేదని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చనిపోవడం బాధాకరమైన విషయమని, కేసులు ఉన్నాయనే కారణంతోనే ఆత్మహత్య చేసుకోవడం సరికాదని అన్నారు. మంత్రి పువ్వాడ నాయకత్వంలో ఖమ్మం జిల్లా బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతోందన్నారు. మంత్రికి బీసీ సంఘాలన్నీ అండగా నిలుస్తాయని, ఎవరెన్ని కుట్రులు పన్నినా ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఏళ్లుగా వివక్షకు గురైన ఖమ్మం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందని అన్నారు. దానిని చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు తమ అజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. మామిడి వెంకటేశ్వర్లు, జక్కుల వెంకటరమణ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.