ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నోరు తెరిస్తే వచ్చి అబద్ధాలు.. వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు.. రాజకీయాల పేరుతో కుట్రలు కుతంత్రాలు.. సొంత కార్యకర్తలనే పావులు చేస్తూ ఆటలు.. కార్యకర్త చనిపోతే పరామర్శల పేరుతో శవ రాజకీయాలు.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ర్టాన్ని పాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు.. చిన్న చిన్న విషయాలకు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల ఓవరాక్షన్. ఇదీ బీజేపీ నేతల తీరు..! ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్న కాషాయ నేతల అరాచకాలపై ప్రజానీకం, గులాబీ శ్రేణులు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మండిపడ్డాయి.. శనివారం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ముక్తకంఠంతో ‘కమలం’ తీరును ఖండించాయి. పద్ధతి మార్చుకోకుంటే కాషాయ నేతలకు బుద్ధి చెప్తామని హెచ్చరించాయి.
ఉద్యమాల గుమ్మం ఖమ్మం మరోసారి లోకానికి లౌకికవాదాన్ని చాటిచెప్పింది. రాజకీయ పార్టీలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేయాలే తప్ప రాజకీయాల ముసుగులో మత విద్వేషాలు పెంచే విధంగా రెచ్చగొడుతున్న బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టింది. రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు ముక్తకంఠంతో కాషాయ నేతల తీరును ఎండగట్టాయి. ఖమ్మం జిల్లాలో రాజకీయ పట్టుకోసం చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తున్నాయి. శనివారం ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బీజేపీ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాయి.
ప్రశాంతమైన వాతావరణంలో ఉద్రిక్తతలు..
ఉమ్మడి జిల్లాలో అనేక రాజకీయ పక్షాలు పరస్పరం ప్రత్యర్థులుగా వ్యవహరించాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేశాయి. సమస్యలపై ఎవరి ధోరణిలో వారు పనిచేసే వారు. ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణమే దశాబ్దాల నుంచి ఉండేది. ఇదే సంప్రదాయమూ నిన్న మొన్నటి వరకూ నడిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో నెలకొన్న ఎన్నో ప్రజాసమస్యలకు పరిష్కారం లభించింది. ఈ కారణంతోనే ప్రజలు గులాబీ పార్టీకే మద్దతునిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నది బీజేపీ. ఆ పార్టీ ఇప్పటివరకు ఏ నియ్జోకవర్గంలోనూ గెలిచిన పాపాన పోలేదు. అన్ని చోట్లా డిపాజిట్లు పోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో గులాబీ పార్టీపై బురద చల్లే పనులకు బీజేపీ తెరలేపింది.
మంత్రి అజయ్‌పై అర్థం లేని ఆరోపణలు..
బీజేపీ నాయకులు సాయిగణేష్ మృతిని అడ్డుపెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఏకపక్షంగా మాటల దాడికి పాల్పడుతున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులూ వ్యవహరించడంపై టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డాయి. సాయిగణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించే పేరుతో బీజేపీ నేతలు ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మంత్రి అజయ్‌కుమార్ చేపట్టిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వంటి నేతలకు టీఆర్ఎస్ శ్రేణులు సవాల్ విసిరినా ఇప్పటికీ స్పందన లభించలేదు.
శవ రాజకీయాలు.. విధ్వంసాలు..
ఖమ్మం నగరానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ అనే యువకుడు ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. 16న హైదరాబాద్ ఆసుపత్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆంజనేయులు ఇప్పటికే ప్రకటించారు. యువకుడి ఆత్మహత్యపై టీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కానీ యువకుడి మృతిని శవ రాజకీయంగా మార్చి కాషాయ పార్టీ నేతలు 16న నగరంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు.
నగరంలో ఏర్పాటు చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్ ఫ్లెక్సీలను చించివేశారు. ఓ ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ప్రధానాసుపత్రి అద్దాలను పగులగొట్టారు.ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.