భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల బలోపేతానికి ఒక్కో అడుగు పడుతున్నది.. నిరుపేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ అమలు చేస్తున్నది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించనున్నది. తరగతి గదులు, ల్యాబ్‌లు, వంట గదులు, ప్రహరీ, టాయిలెట్లు నిర్మించనున్నది. జిల్లాలో 1,044 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇప్పటికే తొలి విడతలో పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని వసతులతో పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి.
సర్కార్ బడులు బలోపేతం కావాలి.. నిరుపేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ని అమలు చేస్తున్నది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించనున్నది. తరగతి గదులు, ల్యాబ్‌లు, వంట గదులు, ప్రహరీ, టాయిలెట్లు నిర్మించనున్నది. భద్రాద్రి జిల్లాలో జిల్లావ్యాప్తంగా 1,044 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా తొలి విడతగా 368 పాఠశాలను ఎంపిక చేసింది.
పాఠశాలల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు ప్రకటించింది. ఇప్పటికే 212 పాఠశాలల్లో అనేక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి రూ.2 కోట్ల అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. రూ.30 లక్షల అంచనా లోపు పనులకు టెండర్ల ప్రక్రియ లేకుండానే నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం సాంకేతిక అనుమతులతో పాటు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఎంఈవో అగ్రిమెంట్ కుదుర్చుకునే ప్రక్రియ జరుగుతున్నది. ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను మొదలుపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అన్ని వసతులతో పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి.
పనులు ఇవీ..
ఉపాధి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణాలను టెండర్లు లేకుండానే చేపట్టనున్నది. బల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్‌క్లాస్ రూం పరికరాలు, పేయింట్స్, గ్రీన్ చాక్‌పిస్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, ఫర్నీచర్‌ను టెండర్ల ద్వారా కొనుగోలు చేయనున్నది. అధికారులు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం పాఠశాలల్లో తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్లతో పాటు ఇతర మరమ్మతులు జరుగనున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, ప్రహరీ నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేశారు. తిరిగి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలలను అన్ని వసతులతో పునః ప్రారం భించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం భేష్..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయడం హర్షణీయం. పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇబ్బంది పడుతున్నారు. సర్కార్ బడుల్లో నాణ్యమైన ఇంగ్లిష్ విద్య అందిస్తే పిల్లలను ఈ పాఠశాలలకే పంపిస్తారు. బడుల్లో అన్ని సౌకర్యాలు ఉంటే పిల్లలు ఇష్టంగా బడికి వస్తారు.
– కుంజా రవి, కోయగూడెం
త్వరలోనే పనులు ప్రారంభం..
తొలివిడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో టెండర్లు లేకుండానే పనులు చేపట్టనున్నాం. ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్స్ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇది పూర్తయిన వెంటనే పనులు మొదలవుతాయి. రూ.15 కోట్లతో చేపట్టే పనులను జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. వచ్చే విద్యాసంత్సరానికి పాఠశాలలను అన్ని వసతులతో సిద్ధంగా ఉంచుతాం. – సోమశేఖరశర్మ, డీఈవో, కొత్తగూడెం