ఎర్రుపాలెం, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా చేయూతనిస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. ఆదివారం ఎర్రుపాలెం హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, పెద్దగోపవరం ప్రాథమిక పాఠశాలలో జరిగిన మన ఊరు- మన బడి కార్యక్రమాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగా మన ఊరు- మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, అన్ని వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
మన ఊరు- మన బడితో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారనున్నాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యలోనే కొత్త ఒరవడి మన ఊరు- మన బడి అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంఈవో ప్రభాకర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచులు మొగిలి అప్పారావు, శివాజీ, ఎంపీటీసీలు సగ్గుర్తి కిశోర్, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, సంగిరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు నండ్రు జనార్దన్‌రావు, సత్యవతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.