అమీర్‌పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళా జర్నలిస్టుల సదస్సు ముగింపు ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో 18వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్నారన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి కష్ట సమయాల్లో ఆదుకుంటోందని వివరించారు. కొవిడ్ కష్టకాలంలో మృతిచెందిన 64మంది జర్నలిస్టుల కుటుంబాలను రూ.2 లక్షల చొప్పున సాయం అందించి ఆదుకున్నామని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధి నుంచి ఇప్పటివరకు రూ.42 కోట్లను వెచ్చించడం జరిగిందని వివరించారు. ఛాలెంజింగ్‌గా ఉండే జర్నలిస్టును వృత్తిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. వర్క్ ప్లేస్‌లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముగింపు సభలో ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీతయాదవ్, మహిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మణ్యం, ధన్య రాజేంద్రన్, సుమా బాల, శ్వేత, కవిత తదితరులు పాల్గొన్నారు.