ఖమ్మం, ఏప్రిల్ 24 : కమ్మ జాతిలో జన్మించి అనేక పదవులు అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి కమ్మ జాతికి చేసిన సేవలేమిటో చెప్పాలని టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని వీడీఓస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎక్కడో పుట్టి ఖమ్మానికి వలస వచ్చిన రేణుకాచౌదరిని ప్రజలు ఆదరించి గెలిపిస్తే గిరిజనుల ప్రాణాలను తీసిందని విమర్శించారు. మంత్రి అజయ్‌కుమార్‌ను విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజమెత్తారు. ఒకరు గొడుగు పడితే, మరొకరు ఫ్యాన్ పట్టుకోవాలి.. ఏసీ బస్సులు ఇది నీస్టెల్ అని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న మంత్రి అజయ్‌ను విమర్శించే ముందు మీరు ఖమ్మం జిల్లాకు చేసిన సేవలు ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు.
సాయిగణేశ్ మృతికి మంత్రి అజయ్‌కు సంబంధం లేకున్నా కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.1600 కోట్లతో ఖమ్మంలో అభివృద్ధి పనులు చేసిన ఘనత అజయ్కుమార్ది అని, రేణుకాచౌదరి ఖమ్మంలో అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని, కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనా అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు అజయ్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎక్కడో కూర్చోని విమర్శించడం కాదని, ఖమ్మం వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడిన తరువాత మాట్లాడితే బాగుంటుదని హితువు పలికారు.
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు మోతారపు శ్రావణి, రావూరి కరుణ, నాగండ్ల కోటి, కొత్తపల్లి నీరజ, నాయకులు చావా నారాయణరావు, బెనర్జీ మాట్లాడుతూ ప్రశాతంగా ఉన్న ఖమ్మంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే రౌడీషీట్లు తెరిస్తే మంత్రి అజయ్పైన నిందలు మోపడం సమంజసం కాదన్నారు. మంత్రి అజయ్‌పై కావాలనే కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, ఖమ్మం ప్రజలు వాటిని తిప్పికొడతారని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, పైడిపల్లి రోహిణి, ధనాల రాధ, చిరుమామిళ్ల లక్ష్మి, సరిపూడి రమాదేవి, మందడపు లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు చావా నారాయణరావు, పోట్ల వీరేందర్, మందడపు మనోహర్‌రావు, నాయకులు సతీశ్, ప్రపాద్ పాల్గొన్నారు