ఖమ్మం, ఏప్రిల్ 23:ఉద్యమాల పురిటి గడ్డ ఖమ్మం గుమ్మంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు చోటు లేదు. ఉన్మాదు లను తయారు చేస్తూ ఆ పార్టీ నగరంలో శవ రాజకీయాలు చేస్తున్నది.. కాషాయ పార్టీలో పని చేస్తున్న సాయిగణేశ్ ఆ పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. యువకుడి మృతిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులు రాజకీయం చేయడం శోచనీయం..’ అని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూదన్ స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులకు మున్ముందు ప్రజలే బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
ఉద్యమాల పురిటి గడ్డ ఖమ్మంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు చోటు లేదని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. ఉన్మాదులను తయారు చేసే కాషాయ పార్టీ ఖమ్మంలో చేస్తున్న శవ రాజకీయాలను తిప్పి కొట్టాలని శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
బీజేపీలో పనిచేసే సాయిగణేశ్ అనే యువకుడు ఆ పార్టీకి చెందిన కొద్దిమంది నాయకుల ప్రోద్బలంతో ఆత్మహత్య చేసుకుంటే బీజేపీకి చెందిన గల్లీ, ఢిల్లీ నాయకులు ఖమ్మం రావడం శోచనీయమని అన్నారు. సాయిగణేశ్ మృతిచెందాక అందరికంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీగా తామే స్పందించామని, అతడి మరణించడం చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశామని గుర్తుచేశారు. పోలీసు విచారణనూ కోరామన్నారు.
అవన్నీ మరిచి.. ఢిల్లీలో ఉన్న పెద్ద నాయకుల దగ్గర నుంచి గల్లీలో ఉన్న చిన్న నాయకుల వరకూ అందరూ కలిసి టీఆర్ఎస్పై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాడ్సే నుంచి మోదీ వరకూ అందరిదీ మనువాద భావజాలమేనని అన్నారు. గాంధేయ సూక్తులు చెబుతూ గాడ్సే సిద్ధాంతాలను ఆచరిస్తున్నారని మండిపడ్డారు. స్వీయ అస్తిత్వ రాజకీయాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన సీఎం కేసీఆర్‌పైనా, యువనేత కేటీఆర్‌పైనా అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ లాంటి నాయకుడు బీజేపీలో ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి, గుజరాత్‌కు గులాంగిరీ చేయడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ నాయకులకు ఖమ్మం ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలున్న జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డిలు టీఆర్ఎస్పై విమర్శలు చేయడం నీతిమాలిన చర్య అని అన్నారు. బీజేపీ నాయకులను వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిలదీయాలని కోరారు.
బీజేపీ ప్రత్యామ్నాయమే కాదు..
ఖమ్మం నియోజకవర్గంలో కనీసం రెండు వేల ఓట్లు కూడా లేని బీజేపీ.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమే కాదని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సాయి గణేశ్ చనిపోతే మంత్రి పువ్వాడ అజయ్‌కు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. సాయి గణేశ్ ఏమైనా అజయ్‌కు సమకాలిక నాయకుడా అని ప్రశ్నించారు. పరామర్శల పేరుతో ఖమ్మం వస్తున్న బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాయిగణేశ్ మృతిని అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్పైనా, మంత్రి అజయ్‌పైనా ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కమర్తపు ముర ళి, గుండ్లపల్లి శేషు, నరేందర్, ఉమాశంకర్ పాల్గొన్నారు.