ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 23: పాడి రైతుల ఆర్థిక మూలాధారం జీవాలు.. గేదెలు పాలిస్తేనే వారి ఇల్లు గడిచేది.. గొర్రెలు, మేకలు చేతికివచ్చి వాటిని విక్రయిస్తేనే యలమందల కడుపు నిండేది.. పశువులు ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం బాగుంటుంది.. వారి పిల్లల చదువులు ముందుకు సాగుతాయి.. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం జీవాల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించింది.. 2017 నుంచి సంచార వైద్య సేవలను ప్రారం భించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక సంచార వాహనాన్ని కేటాయిం చింది.. దీని కోసం 1962 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందు బాటులోకి తీసుకువచ్చింది. పాడి రైతులు టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయగానే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పశువైద్యులు గ్రామా నికి చేరుకుం టున్నారు. జీవాలకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాలకు సంచార వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2017 లో ప్రారంభమైన ఈ సేవలు ప్రారంభమయ్యాయి. వైద్యానికి ప్రభుత్వం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఐదు సంచార వాహనాలను కేటాయించింది. దీని కోసం 1962 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మూగజీవాలు అనారోగ్యానికి గురైనప్పుడు పాడి రైతులు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయగానే పశువైద్యులు గ్రామానికి వస్తున్నారు. కాల్ చేసిన 30 నిమిషాల వ్యవధిలోనే జీవాలకు వైద్యం చేస్తున్నారు. మనుషులకు 108 తరహాలో మూగజీవాలకూ అత్యవసర వైద్యం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
జిల్లావ్యాప్తంగా 23,894 జీవాలకు వైద్యం..
ప్రభుత్వం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు ఐదు వాహనాలు కేటాయించింది. 108, 104 వాహనాల సౌకర్యం కల్పిస్తున్న జీవీకే సంస్థకే 1962 సంచార వాహనాల నిర్వహణ బాధ్యత అప్పగించింది. ప్రతి వాహనంలో ఒక పశువైద్యుడు, ఒక సహాయకుడు అందుబాటులో ఉంటారు. పాడి రైతులు కాల్ చేసిన 30 నిమిషాల లోపే సంచార వాహనం సదరు గ్రామానికి చేరుకుంటుంది. ఈ సేవలతో పాటు జీవాలకు సీజనల్‌గా వచ్చే వాధుల నివారణకు, కృత్రిమ గర్భధారణకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 98,240 పశువులకు సంచార వాహనం ద్వారా వైద్య సేవలు అందాయి.
రోజుకు సగటున 3 వేల కాల్స్..
సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన ఈ సంచార వైద్యం దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సకాలంలో వైద్యసేవలు అందడంతో మూగజీవాల మరణాల సంఖ్య తగ్గుతున్నది. దీంతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1962 టోల్ ఫ్రీ నంబరుకు సగటున రోజుకు 3 వేల కాల్స్ వస్తున్నట్లు జీవీకే సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో ప్రతి షిఫ్టుకు 12 మంది చొప్పున రోజుకు 36 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రైతుల కాల్స్ స్వీకరించి సంచార పశు వైద్యశాలకు సమాచారం చేరవేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్‌లో పశువైద్యుడు, ఒక టెక్నీషియన్‌తో అవసరమైన మందులు తీసుకుని గ్రామాలకు వెళ్తున్నారు. మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం ఒక వైపు జీవాలకు ఆరోగ్య భరోసా అందిస్తూనే మరోవైపు గొర్రెలు, మేకల పెంపకందారులకు పలు విధాలుగా రాయితీలు కల్పిస్తున్నది.
మారుమూల పల్లెలకు వైద్యసేవలు..
ఉమ్మడి రాష్టంలో మూగజీవాలకు సరిగా పశువైద్యం అందేది కాదు. సీఎం కేసీఆర్ ముందుచూపు కారణంగా నేడు లక్షలాది జీవాలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. 1962 సంచార వాహనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లోని జీవాలకు వైద్యం అందుతున్నది. 108 వాహనాలు మాదిరిగానే పశు సంచార వాహనాలు గ్రామాలకు వస్తున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో పశువులకు వైద్య చికిత్స అందుతున్నది.
– మేకల మల్లిబాబు యాదవ్, జీవాల పెంపకందారుల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు