తల్లాడ, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా మొదటి విడతగా ఖమ్మం జిల్లాలో 426 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మండలంలోని మల్లవరం, కొడవటిమెట్ట ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’ పథకం పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లవరం రైతువేదికలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి విడతగా ఎంపిక చేసిన 420 పాఠశాలల్లో 55 వేల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియాన్ని బోధించనున్నట్లు చెప్పారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకూ సమాన ప్రాతినిథ్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వచ్చే నెల నుంచి కొత్తగా ఆసరా పింఛన్లు, సొంత స్థలంలో పక్కా గృహాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయనన్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. అనంతరం రెడ్డిగూడెంలో ‘మన ఊరు – మన బడి’ పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెప్రకృతివనాన్ని పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు రాయల వెంకటశేషగిరిరావు, యాదయ్య, సూర్యనారాయణ, గంటా శ్రీలత, రవీందర్రెడ్డి, నరేష్, దామోదరప్రసాద్, దుగ్గిదేవర వెంకట్లాల్, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దూపాటి భద్రరాజు, దుగ్గిదేవర సామ్రాజ్యం, బద్ధం నిర్మల, శీలం కోటారెడ్డి, నారపోగు వెంకటేశ్వర్లు, అయిలూరి లక్ష్మి, జొన్నలగడ్డ కిరణ్, షేక్ యూసూఫ్, బద్ధం కోటిరెడ్డి, జీవీఆర్, మోదుగు ఆశీర్వాదం, బొడ్డు వెంకటేశ్వర్లు, దూపాటి నరేశ్, కేతినేని చలపతి, రుద్రాక్షల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.