ఖమ్మం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గతంలో ఉపాధి కూలీల హాజరు మాన్యువల్ పద్ధతిలో జరిగేది. దీని ద్వారా కూలీలు పనికి వచ్చినా రాకున్నా మస్టర్లలో సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉండేవి. దీంతో ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎం ఎంఎస్) ను అమలు చేస్తున్నది. ఈ విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. దీనిపై ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికా రులు మేట్లకు శిక్షణ ఇచ్చారు. వీరు పని ప్రదేశాల్లో కూలీలు పని చేస్తున్న ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. తద్వారా ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు.. ఎక్కడెక్కడ పనులు జరుగు తున్నాయనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో 589 పంచాయతీల్లో ఎన్ఎంఎంఎస్ విధానం అమలవుతున్నది.
ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)ను అమలు చేస్తున్నది. ఈ విధానం గతేడాది మే 21 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్నది. తెలంగాణంలో ఈ నెల 1వ తేదీ నుంచి అమలవుతున్నది. ఈ విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. దీనిపై ఇప్పటికే జిల్లాగ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు మేట్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి పదిమంది కూలీలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వివరాలను ఆన్లైన్లోని మస్టర్లలో నమోదు చేశారు. వివరాల నమోదుకు ప్రతి పంచాయతీకి ఒక మేట్‌ను నియమించారు. మేట్‌కు కూలీలతో సమానమైన వేతనం అందుతుంది. పని జరుగుతున్న ప్రదేశాల్లో ప్రస్తుతం మేట్లు కూలీల హాజరు సంఖ్యను అప్పటికప్పుడు వివరిస్తున్నారు. కూలీలు పని చేస్తున్న ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లోని 589 పంచాయతీల్లో ఎన్ఎంఎంఎస్ విధానం అమలవుతన్నది.
పారదర్శకత ఇలా..
ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలీల హాజరు మాన్యువల్ పద్ధతిలో జరిగేది. ఈ విధానంలో కూలీలు పనికి వచ్చినా రాకున్నా మస్టర్లలో సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. పాత పద్ధతిలో అధికారులకు ఎప్పటికప్పుడు పని చేస్తున్న కూలీల సమాచారం అందేది కాదు. పర్యవేక్షణ కొరవడేది. ఇప్పుడు అంతా ఆన్లైన్ పద్ధతి ఉండడంతో పనులు పక్కా పారదర్శకతతో జరుగుతున్నాయి. జిల్లాలో 3,14,881 కుటుంబ జాబ్‌కార్డులు ఉండగా వ్యక్తిగత జాబ్ కార్డులు ఉన్న వారు 6,94,888 మంది ఉన్నారు. వీరంతా ఉపాధి పనులకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు.
ఇప్పుడంతా ఆన్లైన్ పద్ధతి అమలవుతుండడంతో పక్కాగా వేతనాలు అందుతున్నాయి. పని ప్రదేశంలో మేట్లు కూలీలు పనిచేస్తున్న ఫొటోను అప్పటికప్పుడు ఆన్లైన్లో పంపిస్తున్నారు. కూలీల హాజరు సంఖ్యను, గైర్హాజరు సంఖ్యను ప్రకటించి పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఎంత మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అవకతవకలకు తావులేకుండా జియోట్యాగింగ్ విధానం అమలవుతున్నది. ప్రస్తుతం కూలీలు చెరువులు, కుంటల్లో పూడికతీత, వ్యవసాయ క్షేత్రాలను చదును చేయడం, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్ కొట్టడం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్ఎంఎంఎస్ విధానంలో కూలీలు చేసిన పనికి పారదర్శకంగా వేతనాలు అందుతాయి.
జిల్లాలో పకడ్బందీగా అమలు..
జిల్లాలో ఎన్ఎంఎంఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలుపరుస్తున్నాం. ఉపాధి కూలీల హాజరును ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ఏ ప్రాంతంలో ఎంతవరకు పనులు జరుగుతున్నాయన్న విషయంపై స్పష్టత వస్తున్నది. పని జరిగే ప్రదేశంలో జియో ట్యాగింగ్ ఉండడంతో పర్యవేక్షణ సులువైంది. ఆన్లైన్లో హాజరు నమోదు పూర్తి పారదర్శకంగా జరుగుతుంది.
– విద్యాచందన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, ఖమ్మం