భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 20: పదిలో గ్రేడ్లు సాధించేందుకు ఇంటర్నల్ మార్కులు కీలకం. ఆ మార్కులు ఆయా పాఠశాలల యాజమాన్యాల చేతుల్లో ఉండ డంతో కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణ లున్నాయి. టెన్త్ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు కచ్చితంగా రావాలంటే వారు రాసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ లిస్టు చూడా లి. దీంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. పది విద్యార్థులకు ఇంట ర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా? ప్రతిభ ఆధారంగానే మార్కులను వేశారా? లేదా? అనే అంశాలపై ఆరా తీశారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల (ప్రభు త్వ, ప్రైవేట్, ఎయిడెడ్) స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పరిశీలించారు. అనంతరం ఇంటర్నల్ మార్కులను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదు చేశారు.
కష్టపడి చదివితే పక్కాగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఎంత చదివినా ఇంటర్నల్ మార్కులు తగ్గితే గ్రేడ్ రాని సందర్భాలూ లేకపోలేదు. గ్రేడ్లు సాధించేందుకు ఇంటర్నల్ మార్కులు ఎంతో కీలకం. ఆ మార్కులు కేవలం ఆయా పాఠశాలల యాజమాన్యాల చేతుల్లో ఉండడంతో కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని అభియోగాలూ లేకపోలేదు. ఇందుకోసం టెన్త్ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు కచ్చితంగా రావాలంటే వారు రాసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ లిస్టు చూసి తీరాల్సిందే. దీని కోసం విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన వారికే పక్కాగా మార్కులు రావాలనే అంశంపై ఇటీవల రెండు రోజుల పాటు భద్రాద్రి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తనిఖీ బృందాలు పరిశీలించాయి.
టెన్త్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా? ప్రతిభ ఆధారంగానే మార్కులను నమోదు చేశారా, లేదా? అనే అంశాలను ఇటీవల తనిఖీ చేసి పరిశీలించారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్) స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పర్యవేక్షించారు. ఇందుకోసం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో నియామకమైన 42 బృందాలు రెండు రోజులపాటు పర్యవేక్షణ చేసి నిర్ధారించాయి. తరువాత ఆ ఇంటర్నల్ మార్కులను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదు చేశారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,359 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు 1,035, కేజీబీవీలు 14, ఎయిడెడ్ పాఠశాలలు 30, అన్ ఎయిడెడ్ (ప్రైవేట్) పాఠశాలలు 194, సంక్షేమ పాఠశాలలు 315 ఉన్నాయి. వీటన్నింటి నుంచి 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు 13,420 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు నిర్వహించారు. ప్రాజెక్టులు, రికార్డులు సహా ఏడాదంతా ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి మార్కులు నమోదు చేశారు. అయితే అవి సక్రమంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని కమిటీలు నిర్ధారించాయి. ఈ నెల 11, 12 తేదీల్లో తనిఖీలు పూర్తయ్యాయి.
పరిశీలించిన అంశాలివే..
కరోనా ప్రభావంతో అని పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కొన్ని మాత్రమే ఎఫ్ఏ టెస్టులు నిర్వహించారు. ప్రతీ ఎఫ్ఏ టెస్టుకు 8 మార్కులు చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయిస్తారు. అదే విధంగా ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులుంటాయి. ఈ విద్యాసంవత్సరం నిర్వహించిన రెండు ఎఫ్ఏ టెస్టులకు కలిపి 20 మార్కులకు యావరేజ్ చేస్తారు. ఇదేగాక సీసీఈ నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందా? లేదా? అనే అంశాలను కమిటీల బాధ్యులు పరిశీలించారు. జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆయా మార్కులను ఎస్ఎస్సీ బోర్డుకు అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రమాణాలను బట్టి నిబంధనల మేరకు మార్కులను ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం దాదాపు అందరికీ బైకి బై మార్కులు వేస్తున్నారు. ఈ అంశం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని నిరుడు పర్యవేక్షించిన బృందాలు వెల్లడించాయి. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సక్రమంగా ప్రాక్టీస్ చేయకపోయినా మార్కులు నమోదు చేశారు. దీనిని గతంలో తనిఖీ చేసిన అధికారులు గుర్తించిన విషయం విదితమే. ఇలాంటి అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ సీరియస్గా ఉండడంతో మార్కుల నమోదు తనిఖీని పటిష్టంగా నిర్వహించారు.
తనిఖీలు పక్కాగా నిర్వహించాం..
విద్యార్థుల ప్రతిభకు ఇంటర్నల్ మార్కులు ఎంతగానో ఉపయోగ పడతాయి. గతంలో జరిగిన తీరును బట్టి ఈసారి ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించింది. జిల్లా వ్యాప్తంగా 42 బృందాల ద్వారా అన్ని పాఠశాలలను తనిఖీ చేశాం. ప్రతి అంశాన్నీ పరిశీలించాం. వాటి నివేదికలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాం. ప్రైవేటు స్కూళ్లను నేనే స్వయంగా తనిఖీ చేశాను. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్ మార్కులు వస్తాయి.
–సోమశేఖర శర్మ, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం